అల్లు ఫ్యామిలీ సపోర్ట్ టీడీపీకా.. జనసేనకా?

ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ క్లాస్ పీకినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో వీరంతా కలిసినట్లు అనిపించినా ఇప్పుడు మాత్రం మళ్ళీ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది.

Advertisement
Update:2022-10-12 19:14 IST

కొన్ని నెలల కిందటి వరకు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి, ఆయన తమ్ముళ్ళు, మేనల్లుళ్లు, బావమరిది అల్లు అరవింద్, ఆయన తనయుడు అల్లు అర్జున్ తదితరులు అని అంతా అనుకునేవారు. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీ కి మధ్య కొంత దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్ కు ఇటీవల దీనిపై మీడియా నుంచి పలుసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని కొన్ని విషయాల వల్ల వారి మధ్య గ్యాప్ ఉన్నట్లు అర్థమవుతోంది.

ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ క్లాస్ పీకినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో వీరంతా కలిసినట్లు అనిపించినా ఇప్పుడు మాత్రం మళ్ళీ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇటీవల బాలకృష్ణ కుటుంబానికి అల్లు అరవింద్ కుటుంబం బాగా దగ్గర అవుతుండటం ఫ్యాన్స్ ఆశ్చర్యం కలిగిస్తోంది.

చిరంజీవి, బాలకృష్ణ సమకాలీన నటులు అన్న విషయం అందరికీ తెలిసిందే. వారు హీరోలుగా స్టార్డం సంపాదించుకున్నప్పటినుంచి ఇప్పటివరకు మెగాభిమానులు, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. చిరంజీవికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చిన అల్లు అరవింద్ కూడా మొదటి నుంచి బాలకృష్ణతో పెద్దగా సంబంధాలు నెరపలేదు. అయితే ఆయన ఆహా అనే ఓటీటీ స్టార్ట్ చేసిన తర్వాత అందులో అన్ స్టాపబుల్ అనే ఒక షోని ప్రారంభించారు.

అయితే ఈ షో ప్రారంభానికి ముందే మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయన్న టాక్ ఉంది. అందువల్లే ఎటువంటి మొహమాటం లేకుండా అల్లు అరవింద్ మెగా కుటుంబానికి దూరం అనుకునే వ్యక్తి అయిన బాలకృష్ణను తీసుకువచ్చి అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా పెట్టుకున్నారు. ఈ షో ప్రారంభమైన తర్వాత పలు సందర్భాల్లో పలు వేదికల్లో అల్లు అర్జున్ బాలకృష్ణను తెగ పొగిడారు. అంతకుముందు బాలకృష్ణకు అల్లు అర్జున్ కు మధ్య అంత సఖ్యత లేకపోయినా మెగా ఫ్యామిలీతో దూరం పెరిగిన తర్వాత బన్నీ కూడా బాలకృష్ణతో కలుపుగోలుగా ఉంటున్నారు.

అంతకుముందు చిరంజీవి ఇంట ఏ కార్యక్రమం జరిగినా హాజరయ్యే అల్లు అర్జున్ కొన్ని నెలలుగా హాజరు కావడం మానేశాడు. ఇదిలా ఉండగా అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం రెండవ సీజన్ ప్రారంభిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే తొలి వ్యక్తిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఇక్కడ అనుమానించాల్సింది ఏంటంటే అన్ స్టాపబుల్ అనేది ఒక ఎంటర్ టైన్మెంట్ షో. అంతకు ముందెప్పుడు ఈ షోకి ఒక రాజకీయ నాయకుడిని ఆహ్వానించింది లేదు. ఇప్పుడు చంద్రబాబును పిలిచారు.

దీంతో ఇప్పుడు అల్లు అరవింద్ ప్రమేయం లేకుండానే, ఆయన అనుమతి తీసుకోకుండానే ఈ షోకు చంద్రబాబును తీసుకువచ్చారా ..అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మామూలుగా అయితే పవన్ కల్యాణ్, చిరంజీవిని అల్లు అరవింద్ పిలిస్తే వారు ఈ కార్యక్రమానికి రావడం పక్కా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబును ఈ షోకు పిలుచుకువచ్చారు. దీంతో ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మద్దతు జనసేనకు ఉందా..లేదా.. అన్న ప్రశ్నలు మెగా అభిమానుల్లో కలుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప విడుదల సమయంలో ఏపీలో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఆ కారణంగా ఈ సినిమా తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

ఆ తర్వాత ఏపీలో టికెట్ల ధరలు పెంచాలని చిరంజీవి ఆధ్వర్యంలో మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి జగన్ ను కలసి విన్నవించారు. అయితే జగన్ ను కలిసిన వారిలో మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ మాత్రం లేడు. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల తర్వాత టాప్ రేంజ్ లో ఉన్న హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్. పవన్ జనసేన పార్టీ అధినేత కాబట్టి, ఎన్టీఆర్ టీడీపీ మద్దతుదారుడు కాబట్టి జగన్ ను కలవడానికి రాలేదు.

చరణ్ తరఫున చిరంజీవి రాగా ప్రభాస్, మహేష్ హాజరయ్యారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఈ సమావేశానికి రాలేదు. దీన్నిబట్టి అల్లు ఫ్యామిలీ వైసీపీకి దూరం అని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ కు పవన్ కల్యాణ్ కు మధ్య ఉన్న గ్యాప్ కారణంగా జనసేనకు కూడా అల్లు ఫ్యామిలీ దూరమైందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకు చంద్రబాబును తీసుకురావడంతో అల్లు ఫ్యామిలీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News