పోలీసులపై 'పుష్ప' ఎఫెక్ట్

అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే వచ్చారు. ప్రచారం కానీ, రోడ్ షో కానీ, బహిరంగ సభ కానీ అక్కడ ప్లానింగ్ లో లేదు. అందుకే ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

Advertisement
Update:2024-05-12 18:45 IST

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవి కోసం ప్రముఖ హీరో అల్లు అర్జున్ నంద్యాల రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, శిల్పా రవి ఇంటికి రావడంతో అక్కడకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. బయట రోడ్డుపై ఉన్న అభిమానులకు ఇంటిలోనుంచి అల్లు అర్జున్, శిల్పా రవి అభివాదం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఈ వ్యవహారంలో పోలీసులు ఇరుకున పడటం ఇప్పుడు విశేషం.

అల్లు అర్జున్ రావడంతో నంద్యాలకు భారీగా అభిమానులు చేరుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది గంటల తరబడి అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నిన్ననే అల్లు అర్జున్, శిల్పా రవిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అక్కడితో కథ ముగిసిపోలేదు. ఈరోజు ఎన్నికల కమిషన్ స్థానిక పోలీసులపై సీరియస్ అయింది. జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల టూటౌన్ సీఐ రాజారెడ్డిపై ఛార్జిషీటు ఓపెన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. బాధ్యులైన పోలీసులపై శాఖాపరంగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి 60 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని, తమ అనుమతి లేకుండా కేసు కొట్టి వేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పింది.

సెలబ్రిటీలు ప్రచారానికి వచ్చినప్పుడు కచ్చితంగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే వచ్చారు. ప్రచారం కానీ, రోడ్ షో కానీ, బహిరంగ సభ కానీ అక్కడ ప్లానింగ్ లో లేదు. అందుకే ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కానీ బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఈసీ ఆగ్రహం.. ఇలా వ్యవహారం టర్న్ తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News