ఏపీలో పొత్తు రాజకీయాలు.. మారుతున్న సమీకరణాలు

ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వైసీపీకి కూడా లోలోపల భయం ఉన్నా.. మరీ అధికారం దూరంకాదనే ధీమాతో ఆ పార్టీ ఉంది.అయితే ప్రతిపక్షాలు ఏకమైతే మాత్రం గెలిచే సీట్ల విషయంలో తేడా రావొచ్చు.

Advertisement
Update:2023-05-31 15:35 IST

ఏపీలో పొత్తు రాజకీయాలు.. మారుతున్న సమీకరణాలు

ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో పొత్తుల ఎత్తులేవీ లేవని తేలిపోయింది. వామపక్షాలు కాస్త ఊగిసలాడుతున్నా.. వారి ప్రభావం పరిమితం కాబట్టి ఎవరికి వారే పోరాటం చేస్తారని అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఏపీలో మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. సింగిల్ గా వస్తామంటూ వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ ఎవరినీ కలుపుకోవాలనుకోవట్లేదు, ప్రతిపక్షాల్లో కూడా ఎవరికీ వైసీపీకి దగ్గరవ్వాలనే ఆసక్తి లేదు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం అందర్నీ కలుపుకొని వైసీపీతో యుద్ధం చేయాలని చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. పైకి మాత్రం ఎవరు కలిసొచ్చినా రాకపోయినా.. అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.

జనసేన పరిస్థితి ఏంటి..?

2014 ఎన్నికల్లో పార్టీ నిర్మాణం కోసం అంటూ పోటీకి దిగకుండా ఒడ్డునే ఉండి టీడీపీ, బీజేపీని సపోర్ట్ చేసి వారి విజయంలో భాగస్వామి అయ్యారు పవన్ కల్యాణ్. 2019లో ఒంటరిగా బరిలో దిగి సింగిల్ సీటు సంపాదించారు. స్వయానా పవన్ రెండు చోట్లా ఓడిపోయినా, జనసేన బోణీ కొట్టిందనే సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచన చేరే సరికి జనసేన స్కోర్ జీరో. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఆ ఒక్క పార్టీతోనే కలసి 2024 ఎన్నికలను ఎదుర్కొంటారా లేక, బీజేపీని వదిలేసి టీడీపీతో కలుస్తారా, లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కోసం ట్రై చేస్తారా అనేది తేలాల్సి ఉంది. సీట్ల విషయంలో ఇప్పటికే పార్టీ నాయకులకు ఓ క్లారిటీ ఇచ్చారు పవన్, తాను సీఎం సీటు పోటీలో కూడా లేనని తేల్చేశారు. అయితే పొత్తు బీజేపీతోనా, టీడీపీతోనా, ఆ రెండిటితోనా అనేది తేలాల్సి ఉంది.

బీజేపీ కిం కర్తవ్యం..

2014లో టీడీపీ సపోర్ట్ తో ఏపీలో 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ, 2019లో జీరో దగ్గరే ఆగిపోయింది. స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం మరీ తీసికట్టుగా ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ జోరు చూపించింది కానీ, బీజేపీ ప్రభావం శూన్యం. టీడీపీతో కలసి వెళ్లాలని కొంతమంది నాయకులకు ఆశగా ఉన్నా, అధిష్టానం నిర్ణయమే ఫైనల్. బీజేపీతో జత కట్టడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ బాబుని మళ్లీ చేరదీస్తుందా లేదా అనేది తేలడంలేదు. కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలకు వైసీపీ వంతపాడుతున్నా.. ఏపీ రాజకీయాల విషయానికొచ్చే సరికి ఆ రెండు పార్టీలు కలిసేలా లేవు. సింగిల్ గా ఫైట్ చేసినా, జనసేనతో కలసి పోరాటం చేసినా పెద్దగా తేడాలేదు. అందుకే టీడీపీతో బేరాలాడేందుకు బీజేపీ ఉత్సాహంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

వైసీపీ ఒంటరిపోరుకి సిద్ధమేనా..?

ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వైసీపీకి కూడా లోలోపల భయం ఉన్నా.. మరీ అధికారం దూరంకాదనే ధీమాతో ఆ పార్టీ ఉంది. వైనాట్ 175 అనేది పెద్ద టార్గెట్ అని జగన్ కి కూడా తెలుసు. టార్గెట్ పెద్దదిగా ఉన్నప్పుడే కనీసం 151ని క్రాస్ చేయొచ్చనే ఆలోచన ఆ పార్టీనేతల్లో ఉంది. అయితే ప్రతిపక్షాలు ఏకమైతే మాత్రం గెలిచే సీట్ల విషయంలో తేడా రావొచ్చు. అందుకే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ము టీడీపీకి ఉందా, జనసేనకు ఉందా అంటూ రెచ్చగొడుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతిపక్షాలన్నీ కలిస్తే వైసీపీకి నష్టం, విడివిడిగా పోటీ చేస్తే మాత్రం అధికార పార్టీకి లాభం. ఈరెండిటిలో ఏది జరిగినా అధికారం మాత్రం తమకు దూరంకాదనే ధీమాతో ఉంది వైసీపీ. 

Tags:    
Advertisement

Similar News