ఏపీలో రక్తసిక్తమైన రోడ్లు.. రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య కుటుంబంతో కారులో నెల్లూరు నుంచి వేలూరుకు వెళుతున్నారు.
సోమవారం తెల్లవారుజామునే ఏపీలో రహదారులు రక్తమోడాయి. తిరుపతి, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ప్రమాదాల్లోనూ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే జరిగాయి. దీన్ని బట్టి డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగంగా నడపడమో కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య కుటుంబంతో కారులో నెల్లూరు నుంచి వేలూరుకు వెళుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద నాయుడుపేట- పూతలపట్టు హైవేపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శేషయ్య, ఆయన భార్య జయంతి, బంధువు పద్మమ్మ, కారు డ్రైవర్ సమీర్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
చెన్నై- కోల్‌కతా హైవేపై కొవ్వూరు నుంచి తమిళనాడు వెళుతున్న మరో కారు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొని, అవతలివైపు వస్తున్న లారీ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్వామినాథన్, గోపి అనే 30 ఏళ్ల వయసున్న వ్యక్తులతోపాటు రాకేశ్ (12), రాధాప్రియ (14) అనే ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రగిరి వద్ద జరిగిన మరో ప్రమాదంలోనూ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వాహనం అవతలి రోడ్డులోకి దూసుకుపోయింది. దీంతో కారుకు నిప్పురవ్వలు వచ్చి వాహనం పూర్తిగా తగలబడిపోయింది.