సంజయ్ పాదయాత్ర ట్రైలరే.. రేవంత్ కు 70 ఎంఎం సినిమా చూపిస్తం
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రైతుల పక్షాన చేస్తున్న పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. సీఎం రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో 70 ఎంఎం సినిమా చూపిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ మంగళవారం కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వెన్నుముక సర్జరీలు చేసే మంచి డాక్టర్‌గా పేరున్న సంజయ్.. దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం పాదయాత్ర చేశారని అన్నారు. రేవంత్ పాలనలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో క్వింటాల్ పై రైతులు రూ.వెయ్యి నష్టపోతున్నారని తెలిపారు. వడ్లు కొనడు కానీ మహారాష్ట్రకు పోయి బోనస్ ఇస్తున్నానని రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు రైతుబంధు ఇచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే కాంగ్రెస్ కంప్లైంట్ చేసి అది రాకుండా అడ్డుకుందన్నారు. ఎకరానికి రూ.10 వేలు కాదు రూ.15 వేలు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ రైతులను నిండా ముంచిందన్నారు. రైతుబంధు రాలేదు, రుణమాఫీ కాలేదు.. బోనస్ ఇవ్వలేదన్నారు. జగిత్యాల చుట్టూ ఉన్న దేవుళ్ల మీద రేవంత్ ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. 60 లక్షల మంది రైతులకు మంచి జరుగుతుందంటే దానికన్నా తనకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదని రాజీనామాకు సిద్ధమయ్యానని, రుణమాఫీ పూర్తి చేయకుంటే పదవికి రాజీనామా చేస్తానన్న ముఖ్యమంత్రి సగం మందికి కూడా మాఫీ చేయలేదన్నారు. రూ.2 లక్షలకు పైన అప్పు ఉన్న రైతులు ఆ మొత్తం చెల్లించినా కూడా వారికి రుణమాఫీ చేయడం లేదన్నారు.
కేసీఆర్ హామీ ఇవ్వకపోయిన రైతుబంధు, రైతుబీమా ఇచ్చారని గుర్తు చేశారు. రూ.72,815 కోట్లు రైతుబంధు రూపంలో కేసీఆర్ సాయం చేశాడని అన్నారు. కరోనా లాక్‌డౌన్ పెట్టినా రైతుబంధు ఆపలేదు, వడ్ల కొనుగోళ్లు ఆపలేదన్నారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు వస్తాయి కానీ రైతులకు ఇవ్వడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు నీళ్లియ్యాలని ధర్నాలు చేసేవారని, అలాంటి వరద కాలువను కేసీఆర్ రిజర్వాయర్ చేసిండని తెలిపారు. కేసీఆర్ రైతుల సీఎంగా పేరు పొందితే రేవంత్ బూతుల సీఎంగా మారిండన్నారు. సంజయ్ పాదయాత్ర చూసైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి చూడాలన్నారు. గాలిమోటర్లలో తిరుగుడు కాదు భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. రైతులు తమ వడ్ల లోడు ఎత్తమని కోరుతుంటే రేవంత్ మహారాష్ట్రకు డబ్బు మూటల లోడెత్తుతున్నాడని ఎద్దేవా చేశారు. మూసీ కంపుకన్నా రేవంత్ నోటి కంపే ఎక్కువ అన్నారు. మూసీలో ఇండ్లు కూలగొట్టిన చోట పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. సీఎం ఒట్టుపెట్టి రుణమాఫీ చేయనందుకు దేవుళ్లు ప్రజలపై పగబట్టొద్దని కోరుతున్నానని తెలిపారు. రైతులకు వెంటనే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్ లకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్నిరకాల వడ్లకు రూ.500 చొప్పున క్వింటాల్ కు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మహిళలకు ఇస్తామన్నా రూ.2,500లకే దిక్కులేదు.. మహారాష్ట్రలో రూ.4 వేలు ఇస్తానని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని, 300 రోజులు దాటినా అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చారని, ఒక్క ఉద్యోగమైనా వాళ్లు వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చారో చెప్పాలన్నారు. రూ.300 కోట్లు పెట్టి పేపర్లలో అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమి లేదన్నారు. పోలీసుల భార్యలతో పోలీసులతో కొట్టించాడని, విద్యార్థులను రోడ్లపైకి తెచ్చాడని.. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 37 మంది చనిపోయారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి జగిత్యాలకు చేసిన ఒక్క మంచి పని చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, గొల్ల కురుమలకు ఇచ్చే గొర్రెపిల్లలు, గంగపుత్రులు, ముదిరాజులకు ఇచ్చే చేప పిల్లలను బంద్ చేశాడన్నారు. తరాజులో పెట్టి ఎమ్మెల్యేలను కొనడం మినహా రేవంత్ చేసిందేమి లేదన్నారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, నాయకులు తుల ఉమ, విద్యాసాగర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.