రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి బీఆర్‌ఎస్‌ కమిటీ

మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి సహా పలువురు నేతలకు చోటు

Advertisement
Update:2025-01-20 16:21 IST

తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు దారితీస్తోన్న వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, జోగు రామన్న, పువ్వాడ, అజయ్‌, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, రసమయి బాలకిషన్‌, అంజయ్య యాదవ్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సాగుకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలకు కారణాలు, ఇతర అంశాలతో కూడిన నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడికి సమర్పిస్తారని తెలిపారు. రెండు వారాల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. ఏడాది కాలంలో వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, సన్నచిన్నకారు రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచుతామని కేటీఆర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News