రైతులందరికీ ఒకే విడతలో రైతుభరోసా సాయం అందించాలే
మాజీ సర్పంచులకు వెంటనే బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైతుభరోసా నిధులు ఏకకాలంలో విడుదల చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో రైతులు, మాజీ సర్పంచులు, వివిధ సంఘాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తాత్సారం తగదని అన్నారు. మొదట మండలంలోని ఒక గ్రామానికి మాత్రమే రైతుభరోసా ఇచ్చిన ప్రభుత్వం నిన్ని ఒక ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిందన్నారు. ఇప్పటికే రైతులు పంటలు సాగు చేసి రెండు నెలలవుతోందని.. ఇకనైనా పెట్టుబడి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఏడాది గడిచినా బిల్లులు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.