అన్నం పెట్టే రైతును కాంగ్రెస్ ఆపదలోకి నెట్టింది
కేసీఆర్ పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని రేవంత్ దండగలా మార్చిండు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
అన్నం పెట్టే రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదలోకి నెట్టేసిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ కమిటీ సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్, జోగు రామన్న, వినోద్ కుమార్, అంజయ్య యాదవ్, దేవీప్రసాద్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దండగలా మార్చిందన్నారు. వరంగల్ జిల్లా తలారిగూడలో రైతుల ధైన్య స్థితిని అధ్యయనం చేయడానికి పోలీసులు తమను అనుమతించకపోవడం దారుణమన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగుతోంది అనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో 14 నెలలుగా గాలి మాటలు తప్ప పాలనే సాగడం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ రైతులు రోడ్డెక్కారని.. పంటలకు మద్దతు ధర లేక తల్లడిల్లుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని రేవంత్ రెడ్డి అంటుంటే.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్‌నే గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. దీనినే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో నిరాశ నిస్పృహకు లోనై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. వారి కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులో పట్టుకొని తిరుగుతున్నారు కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తెలంగాణలో కొనసాగించడం లేదన్నారు. రైతుభరోసా సంక్రాంతికి ఇస్తామని ఒకసారి, జనవరి 26కు అని ఇంకోసారి.. ఇప్పుడు మార్చి 31న అని చెప్తున్నారని.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు గాను 4.42 లక్షల మందికి మాత్రమే రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ మంత్రులకు జ్ఞానం లేదని ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వాళ్ల జ్ఞానం ఎమయ్యిందో చెప్పాలన్నారు. రాష్ట్ర స్థితిగతులపై అవగాహన లేకుండా హామీలిచ్చిన పార్టీకి పరిపాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. హామీల ఎగవేతపై సీఎం మాట్లాడకుండా స్పీకర్‌తో మాట్లాడిస్తున్నాడని అన్నారు. కేసీఆర్‌లాంటి పాలన ఎందుకు అందించలేరని గతంలో ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ ను నిలదీశారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను మంత్రి శ్రీధర్ బాబు మెచ్చుకోవడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. రోజూ అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ నాయకులు గాంధీ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.