ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు.. ఇమానం తప్పిన ఈ ప్రభుత్వం

రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలు మానుకోండి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2025-01-03 15:18 IST

ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు.. ఇమానం తప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా ఎగ్గొట్టేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ప్రమాణ పత్రాల పేరుతో రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని, రైతులను భయాందోళనలకు గురి చేసే కుట్రకు తెరతీసిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రజల సొమ్ము రైతులు తిన్నారనే దుష్ప్రచారం ఆపాలన్నారు. ఇచ్చిన హామీలు చేసే సత్తా లేకుంటే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధుతో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయనేది కూడా తప్పుడు ప్రచారమేనని తెలిపారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి గ్రామంలో ఎంతమంది రైతులకు రైతుబంధు ఇచ్చారు.. ఇప్పుడు ఎంతమందికి రైతుభరోసా ఇస్తున్నారనే వివరాలు బయట పెట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అభయహస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని.. ఆరు గ్యారంటీల కోసం అని ప్రజలను ఇబ్బంది పెట్టి తీసుకున్న అప్లికేషన్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ప్రజాపాలన - అభయహస్తం కింద 1.06 కోట్ల మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, ఆ వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు.

రైతులను బాగు చేసేందుకు కేసీఆర్‌ ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు ఇచ్చారని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు శాసించేలా తయారు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం యాచించే స్థితికి తీసుకువచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రమాణ పత్రాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలకు ఎలా సాయం చేయబోతుందో ఈ ప్రభుత్వమే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులంతా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో 12 సార్లు రైతులకు రైతుబంధు ఇచ్చిన అన్నిరకాల సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని, అలాంటప్పుడు మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.17,500 చొప్పున రాష్ట్ర రైతులకు రూ.26 వేల కోట్లు బాకీ పడిందన్నారు. రైతుబంధుతో దుబారా అయినట్టు చెప్తోన్న డబ్బులు ఎవరి ఖాతాల్లో పడ్డాయో గ్రామాల వారీగా వివరాలు బయట పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వ అసలు రంగు బయట పడుతుందన్నారు.

వరంగల్‌ డిక్లరేషన్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని గతంలో రేవంత్‌ రెడ్డి ఉత్తరం రాశారని.. వాళ్లందరికీ రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు చేద్దామని పిలుపునిచ్చారు. సంక్రాంతిలోగా ఆంక్షలు లేకుండా రైతుభరోసా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. దేశ చరిత్రలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు. 11 సీజన్‌లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేసిందని.. 12వ సీజన్‌ డబ్బులు వేసే క్రమంలో ఎన్నికల కమిషన్‌ కు లెటర్‌ రాసి ఆ డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్‌ అడ్డుతగిలిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీని వరంగల్‌ కు తీసుకువచ్చి రైతులను ఉద్దరిస్తామని ఫోజులు కొట్టిందని.. రైతులకు ఎన్నో హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News