ఎక్కడున్నాడో గానీ గ్యాస్ సప్లయ్ కి ఆర్దర్లిచ్చిన గొటబాయ రాజపక్సె

లంక రావణకాష్టానికి ఆద్యుడై, ఆందోళనకారుల దాడులతో భయపడి పలాయనం చిత్తగించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడున్నాడో గానీ మొత్తానికి నేను ఎక్కడో ఒకచోట తలదాచుకున్నానని ప్రపపంచానికి తెలియజేశాడు. బ్యాక్ టు యాక్షన్ అనిపించుకున్నాడు. రెండు రోజులు గడిచినా ఆచూకీ పత్తాలేని గొటబాయ ఓ ఆర్డర్ జారీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంధనం కొరతతో అల్లాడుతున్న తమ దేశంలో వంట గ్యాస్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. ఈ మేరకు కొలంబోలోని ఆయన ప్రధాన […]

Advertisement
Update:2022-07-11 03:55 IST

లంక రావణకాష్టానికి ఆద్యుడై, ఆందోళనకారుల దాడులతో భయపడి పలాయనం చిత్తగించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడున్నాడో గానీ మొత్తానికి నేను ఎక్కడో ఒకచోట తలదాచుకున్నానని ప్రపపంచానికి తెలియజేశాడు. బ్యాక్ టు యాక్షన్ అనిపించుకున్నాడు. రెండు రోజులు గడిచినా ఆచూకీ పత్తాలేని గొటబాయ ఓ ఆర్డర్ జారీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇంధనం కొరతతో అల్లాడుతున్న తమ దేశంలో వంట గ్యాస్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. ఈ మేరకు కొలంబోలోని ఆయన ప్రధాన కార్యాలయానికి ఆదేశాలు అందాయట. లంకకు 3,700 మెట్రిక్ టన్నుల ఎల్ పీ జీ గ్యాస్ అందిందని, దీన్ని అన్ లోడ్ చేసి గ్యాస్ సప్లయ్ చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం.

ఆదివారం మధ్యాహ్నం ఈ గ్యాస్ నిల్వలతో కూడిన మొదటి నౌక కెరవలపిటియా రేవుకు చేరుకున్నట్టు లంక మీడియా తెలిపింది. అలాగే సోమవారం 3,740 మెట్రిక్ టన్నులు, ఈ నెల 15 న 3,200 మెట్రిక్ టన్నుల గ్యాస్ అందనుందని వెల్లడించింది.

అయితే ఈ సమాచారం ఎలా తెలిసిందో గానీ గొటబాయ.. మొదట రేవుకు చేరుకున్న షిప్ నుంచి గ్యాస్ అన్ లోడ్ చేసి దేశంలో పంపిణీ చేయాలని అధికారులను కోరాడు. వంట గ్యాస్, పెట్రోల్ వంటివాటి కొరతతో లంక ప్రజలు నెలల తరబడి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో పొయ్యిలు వెలగడం మానేశాయి.

వంట గ్యాస్ సిలిండర్ల కోసం గృహిణులు గంటలకొద్దీ క్యూలలో నిలబడుతూ వచ్చారు. పెట్రోలు కోసం బంకుల ముందు చాంతాడంత వాహనాలు బారులు తీరుతున్నాయి కూడా.. ఈ పరిస్థితుల్లో దేశంలో అగ్గి రాజుకుంది.

ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగాలంటూ ఆందోళన మొదలై అది హింసాత్మకంగా మారింది. నిరసనలు అగ్నిజ్వాలలుగా మారాయి. ఎంపీలపై దాడులు కొనసాగాయి. శనివారం వేలాది ఆందోళనకారులు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో గొటబాయ భయంతో పారిపోయాడు.

ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయగా ఆయన నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇక అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఆందోళనకారులు జలకాలాటలు ఆడడం, విశాలమైన కిచెన్ లో వంటలు వండుకోవడం, తినడం, ఆయన బెడ్ రూమ్ లో సెల్ఫీలు తీసుకోవడం వంటివి వీడియోలకెక్కాయి.

చివరకు ఓ బీరువాలో కోటి రూపాయల కరెన్సీ కట్టలను కూడా నిరసనకారులు చూసి ఆశ్చర్యపోయారు. పైగా నిన్నటికి నిన్న ఓ పెద్ద కప్ బోర్డు వంటిదాని కింద బంకర్ కూడా వారి కంటబడింది. అయితే దీనికి అడ్డుగా ఉన్న ఉక్కు తలుపును వారు నాశనం చేయలేకపోయారు. ఈ భవనంపై వారు ఓ నల్లజెండాను ఎగురవేసి తమ ‘ఆధిపత్యాన్ని’ చాటుకున్నారు.

అఖిలపక్ష తాత్కాలిక ప్రభుత్వం ?

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అఖిల పక్ష ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజ పక్సె ఈ నెల 13 న (బుధవారం) రాజీనామా చేయనున్నారని స్పీకర్ మహీందా ఇదివరకే ప్రకటించారు.

ఆ తరువాత అన్ని పార్టీలతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చునని వార్తలు వస్తున్నప్పటికీ దీనినెవరూ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ అన్ని పార్టీలతో కలిసి మేం ప్రభుత్వాన్ని ఏర్పరచాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని పాలక శ్రీలంక పొడుజన పెరమున పార్టీ చీలికవర్గం నేత విమల్ వీరవంశ తెలిపారు.

ఇందులో అన్ని పార్టీల నేతలు ఉంటారని వసుదేవ నానాయక్కర అనే మరో నేత చెప్పారు. గొటబాయ రాజీనామా చేసేంతవరకు తాము వేచి ఉండనక్కర లేదని ఆయన అన్నారు. విపక్షాలు కూడా ఇందుకు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. ఇలా ఉండగా నిన్న నిరసనకారులు అధ్యక్ష భవనంలో మాక్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని హేళన చేయడం విశేషం.

 

 

Tags:    
Advertisement

Similar News