గోదావరి ఉగ్రరూపం.. వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదీ ప్రవాహం ఉధృతంగా మారింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. నీటి మట్టం 63 అడుగులకు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 98,275 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 41వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాం సాగర్ నుంచి భద్రాచలం వరకు వరద ఉధృతి […]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదీ ప్రవాహం ఉధృతంగా మారింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. నీటి మట్టం 63 అడుగులకు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 98,275 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 41వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాం సాగర్ నుంచి భద్రాచలం వరకు వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం 13,80,071 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిగువన ఉన్న మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న రక్షణ చర్యలపై ఆరా తీశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్.
కేటీఆర్ సూచనలు..
భారీ వర్షాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో ఫోన్ లో మాట్లాడారు మంత్రి కేటీఆర్. జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టుతో పాటు మానేరు నది వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్స్ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలిస్తూ, అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. తెగిపడ్డ విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇల్లు దాటి బయటకు రావొద్దని కోరారు కేటీఆర్.