ట్రంప్‌ టారిఫ్‌ల వాణిజ్య యుద్ధం ప్రమాదకరం

అది దుందుడుకు చర్య అని దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌;

Advertisement
Update:2025-03-04 14:01 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ అభిప్రాయపడ్డారు. నేటి నుంచి కెనడా, చైనా, మెక్సికోపై భారీ ఎత్తున సుంకాల విధింపును అగ్రరాజ్యం అమెరికా మొదలుపెట్టిన విషయం విదితమే. ఈ నిర్ణయంపై బఫెట్‌ స్పందిస్తూ.. అది దుందుడుకు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తాను కామెంట్‌ చేయనని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే.. ఆ తర్వాత ఏంటీ? మీరు ఎప్పుడూ ఈ మాట అంటుండాలి. మంచిది. ప్రస్తుతం అదే (అమెరికా ఆర్థిక వ్యవస్థ) ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. నేను దాని గురించి మాట్లాడటం కష్టం. నిజంగానే మాట్లాడను' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 94 ఏళ్ల బఫెట్‌ను ప్రపంచం ఓ దిగ్గజ ఇన్వెస్టర్‌లా భావిస్తుంది. ఆయన ఇచ్చే టిప్స్‌, అంచనాల కోసం ఏటా కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బెర్క్‌షైర్‌ హత్‌వే అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో 101 బిలియన్‌ డాలర్లపై పన్నురూపంలో చెల్లించింది. ఈ మొత్తం కొన్ని చిన్న దేశాలతో జీడీపీ సమానం.

మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలు నేటి నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో ఫెంటానిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడానికే ఈ రెండు దేశాలపై అధిక సుంకాలు విధించినట్లు స్పష్టం చేశారు. అమెరికాకు రాయితీలు ఇస్తామని మెక్సికో, కెనడా దేశాలు హామీ ఇవ్వగా.. ట్రంప్‌ వాటిపై సుంకాల విధింపులు ఒక నెల రోజులు ఆలస్యం చేశారు. కానీ తాజాగా ఇరుదేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. కొత్త సుంకాలను తప్పించుకోవడానికి కెనడా, మెక్సికో ఎలాంటి అవకాశం లేదని ట్రంప్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇప్పటికే చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ అదనంగా మరో 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా దేశాధ్యక్షుడి ప్రకటనతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలు చవి చూసింది.

మెక్సికో, కెనడాల ఎగుమతులపై 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. ట్రూడో అగ్రరాజ్యంపై ప్రతికార సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్‌, పండ్లు సహా 155 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.అందులో కొన్ని వస్తువులపై సుంకాలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని మరికొన్ని 21 రోజుల తర్వాత అమలవుతాయని స్పష్టం చేశారు. సుంకాలను అమెరికా ఉపసంహరించుకునేంత వరకు తమ టారిఫ్‌లు అలాగే ఉంటాయన్నారు. నాన్‌ టారిఫ్‌ చర్యలను కొనసాగించడానికి ప్రావిన్స్‌లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రూడో చెప్పారు. అటు మెక్సికో ప్రధాని తమకు బ్యాకప్‌ ప్లాన్స్‌ ఉన్నాయని స్పష్టం చేశారు. తమ దిగుమతులపై సుంకాన్ని 20 శాతానికి పెంచడంపై చెనా స్పందించింది. ప్రతీకార చర్యలకు దిగుతామని హెచ్చరించింది. ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయని చైనా కామర్స్‌ మినిస్ట్రీ పేర్కొన్నది. అమెరికా ఉత్పత్తులపై చైనా కూడా ప్రతికార సుంకాలు విధించింది. ఆ దేశ ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్‌, గోధుమ, మక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది.

Tags:    
Advertisement

Similar News