బీజేపీ 'రహస్య ఆపరేషన్' ఏమిటి..?

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ 'రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుందా? ఈ విషయాన్ని తెలిసో తెలియకో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమాయకంగా ధృవీకరించారు. టీఆర్ఎస్ కు,కేసీఆర్ కు కావలసింది కూడా అదే ! బీజేపీ అలాంటి 'చర్యల'కు పూనుకుంటే ఎట్లా తిరగబడాలో, ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులను ఎట్లా ఏకం చేయాలో ముఖ్హ్యమంత్రికి బాగా తెలుసు.

Advertisement
Update:2022-07-10 14:24 IST

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ 'రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుందా? ఈ విషయాన్ని తెలిసో తెలియకో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమాయకంగా ధృవీకరించారు. టీఆర్ఎస్ కు,కేసీఆర్ కు కావలసింది కూడా అదే ! బీజేపీ అలాంటి 'చర్యల'కు పూనుకుంటే ఎట్లా తిరగబడాలో, ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులను ఎట్లా ఏకం చేయాలో ముఖ్హ్యమంత్రికి బాగా తెలుసు. ఇందుకు గాను కేసీఆర్ దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. "టిఆర్ఎస్ పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. బీజేపీలో భారీగా చేరికలుంటాయి. ఇందుకోసం సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోంది. అధికారపార్టీ ఖాళీ కాబోతోంది" అని ఈటల శనివారం అన్నారు. ఈ మాటలు ఆయన కాకతాళీయంగా అని ఉండవచ్చునని ఎవరూ అనుకోవడం లేదు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గ్యారంటీగా దెబ్బ తీస్తామని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించిన 24 గంటల్లోనే ఈటల కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం బిజెపి 'రహస్య ఆపరేషన్' ను నిర్ధారిస్తున్నాయి.'రహస్య ఆపరేషన్' రహస్యంగానే జరుగుతుంది. అంతేకానీ ముందుగానే "మేము రహస్య ఆపరేషన్ చేస్తున్నామ"ని ఎవరూ చెప్పరు. అయితే ఈటల రాజేందర్ మాటల్ని బట్టి ఇందులో మర్మాన్ని అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ దురుద్దేశాలను తనకు తెలియకుండానే ఈటల బయటపెట్టినట్లయ్యింది.

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నది ఈటల లక్ష్యం కావచ్చు. తనను మంత్రి పదవి నుంచి తొలగించి, భూ కబ్జాదారునిగా ముద్ర వేసి రాజకీయంగా అణచివేశారన్న ఆగ్రహంతో కేసీఆర్ పైనే ఈ సారి పోటీ చేస్తానని అంటున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గజ్వేల్ లో సీరియస్ గా హోమ్ వర్కు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీని సాధ్యాసాధ్యాలేమిటి? అసలు కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో ఎవరికీ తెలియదు. అలాగే అసెంబ్లీకి పోటీ చేస్తారో లేక చివరి నిముషంలో లోక్ సభకు పోటీ చేస్తారో తెలియదు. అసెంబ్లీ ఎన్నికలు ముందుగా రానున్నందున అసెంబ్లీకి పోటీ చేసి, లోక్ సభ ఎన్నికల నాటికి రాజీనామా చేసి, పార్లమెంటుకు పోటీ చేయవచ్చు.

ఆయన ఏమి తలపిస్తున్నారో ముందస్తుగా తెలిసే అవకాశం ఆయన వెంట 2003 నుంచి 2021 దాకా ప్రయాణించిన ఈటల రాజేందర్ కు లేదు. కేసీఆర్ పక్కనే నిరంతరం ఆయన యోగక్షేమాలు చూసే ఎంపీ సంతోష్ జోగినపల్లికే తెలియదు. ఈటలకు ఎట్లా తెలుస్తుంది. "రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగాల్ లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి బెంగాల్ సీఎం మమతను ఎట్లా ఓడించాడో అలాగే కేసీఆర్ ను ఓడిస్తా" అని ఈటల అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన మాట నిజమే! అయితే అక్కడి పరిస్థితులు వేరు. రాజకీయ సమీకరణలు వేరు. సువేందు అధికారి మొదట తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నాడు. మమతా బెనర్జీకి కుడిభుజంగా పనిచేశాడు. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ రాష్ట్రంలో కనీసం 100 కు పైగా అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా తృణమూల్ కాంగ్రెస్ లో ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంపాదించాడు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పెద్దపీట వేస్తున్నారన్న సాకుతో ఆయన బీజేపీ పంచన చేరాడు. సువేందు అధికారితో తనను పోల్చుకోవడం ఈటల అమాయకత్వాన్ని బయటపెడుతోంది.

తెలంగాణపై పట్టు బిగించడానికి బీజేపీ ఇప్పటికే రకరకాల వ్యూహాలు రచిస్తోంది. మాయోపాయాలు చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీని పటిష్టపరిచేందుకు చేరికలను ప్రోత్సహించనుంది. "టిఆర్ఎస్ లోనే కట్టప్పలు ఉన్నారని"లక్ష్మణ్ చెప్పినా, కేసీఆర్ పనయిపోయిందని ఈటల చెప్పినా 17,18 నెలల్లో జరిగే ఎన్నికలలో 'ప్రజాతీర్పు'ను అద్దం పట్టినట్టు కాదు.

టీఆర్ఎస్ కూడా ఒక రాజకీయపార్టీ. అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు సహజమే. టీఆర్ఎస్ సహా ఏ రాజకీయపార్టీ కూడా 'పరిశుద్ధ' పార్టీగా ఉండజాలదు. అసంతృప్త నాయకులు, తమకు టికెట్టు రాదేమోనన్న అనుమానాలు, సమాచారం ఉన్న వాళ్ళ సంఖ్యను బీజేపీ అతిగా లెక్కలు గడుతున్నట్టుంది. అలాంటి వారికి పలు ఆశలు చూపి, పార్టీలోకి వలస వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మిత్రుడు, శ్రేయోభిలాషి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం వెనుక ఈటల రాజేందర్ చొరవ ఉంది. టీఆర్ఎస్ అసంతృప్త నాయకులు సమయం చూసి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లవచ్చు. కానీ అందుకు ఇంకా చాలా సమయం ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఫిరాయింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా నష్టం వాటిల్లవచ్చునని సగటు రాజకీయ నాయకుడు అంచనా వేస్తున్నాడు.

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిన కేసీఆర్ ను ఓడించాలన్న కాంక్ష బలంగానే ఉండవచ్చు. అయితే అది అనుకున్నంత సులభమా? అన్నదే ప్రధాన సందేహం. తనను రాజకీయంగా దెబ్బకొట్టిన కేసీఆర్ ను దెబ్బతీయాలని ఈటల ప్రతీకారంతో పొగలు, సెగలు కక్కుతున్నారు. గజ్వేల్ లో పోటీ చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా బీజేపీ హైకమాండ్ ఆమోదించగలదా? లేక ఈటల స్వయంగా నిర్ణయం తీసుకొని పోటీ చేయగలరా? మరి ఈటల ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గం మాటేమిటి? అక్కడి నుంచి ఎవరు పోటీ చేయనున్నారు? బీజేపీ నాయకులు చెబుతున్నట్టుగా 'కేసీఆర్ వ్యతిరేక సునామీ' వస్తుందా? లేక కల అని అనుకోవచ్చునా? బీజేపీ అతి విశ్వాసంతో ఉన్నట్టు భావించాలా?

Tags:    
Advertisement

Similar News