మళ్ళీ రణరంగంగా మారిన శ్రీలంక….అధ్యక్షుడి ఇంటిపై దాడి…పారిపోయిన అధ్యక్షుడు
*శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇంట్లోకి దూసుకెళ్ళిన ఆందోళన కారులు *పారిపోయిన అధ్యక్షుడు రాజ పక్సే *పోలీసు కాల్పులు…50 మందికి గాయాలు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ నిరసనలు మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయమే వేలాది మంది ఆందోళనకారులు కొలొంబోలోని అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇంట్లోకి దూసుకెళ్ళారు. గేట్లను బద్దలు కొట్టి, గోడలు దూకి వేలాదిమంది అధ్యక్షుడి ఇంట్లోకి వెళ్ళారు. గొటబయను పట్టుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో దూసుకెళ్ళిన ప్రజలకు […]
*శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇంట్లోకి దూసుకెళ్ళిన ఆందోళన కారులు
*పారిపోయిన అధ్యక్షుడు రాజ పక్సే
*పోలీసు కాల్పులు…50 మందికి గాయాలు
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ నిరసనలు మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయమే వేలాది మంది ఆందోళనకారులు కొలొంబోలోని అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇంట్లోకి దూసుకెళ్ళారు. గేట్లను బద్దలు కొట్టి, గోడలు దూకి వేలాదిమంది అధ్యక్షుడి ఇంట్లోకి వెళ్ళారు. గొటబయను పట్టుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో దూసుకెళ్ళిన ప్రజలకు ఆయన దొరకలేదు. పరిస్థితి ముందుగానే ఊహించిన ఆయన తన అధ్యక్ష నివాసం నుండి పారిపోయారు.
అధ్యక్షుడి ఇంట్లోకి దూసుకెళ్ళిన ప్రజలపై శ్రీలంక ఆర్మీ కాల్పులకు దిగింది. ఆ కాల్పుల్లో ఎవరైనా చనిపోయారా అనే సమాచారం అందలేదు అయితే 50 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయనే వార్తలు వస్తున్నాయి.
దేశంలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి కొలంబోతో సహా అనేక ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు, అయితే ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్న న్యాయవాదులు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల అభ్యంతరాల మధ్య శనివారం ఉదయం కర్ఫ్యూ ను ఉపసంహరించుకున్నారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది కొలొంబో నగరంలో పెద్ద ఎత్తున మోహరించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం చుట్టూ ఉన్న ప్రాంతం భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే దేశ నలుమూలల నుండి వేలాదిగా కదిలి వచ్చిన ప్రజలను బారికేడ్లను బద్దలు కొట్టుకొని దూసుకేళ్ళారు.
మరో వైపు ఆందోళనకారులకు పోలీసులు సహకరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా అక్కడ పోలీసులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో అంసంతృప్తిగా ఉన్న పోలీసులు ఆందోళనకారులకు పరోక్షంగా సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఆర్మీ మాత్రం ప్రజలతో యుద్దం చేస్తోంది.
కాగా రాష్ట్రపతి నివాసాన్ని వేలాది మంది చుట్టుముట్టి ఉన్నారు. ఆ నివాసాన్ని ప్రజలు ఆక్రమించుకోకుండా ఆర్మీ ప్రజలపై టియర్ గ్యాస్, కాల్పులకు పాల్పడుతోంది.
ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధనం, వంటగ్యాస్,మందులు వంటి నిత్యావసరాలకు భారీ కొరత ఏర్పడింది, కొద్ది సామాగ్రిని కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు పొడవైన లైన్లలో నిలబడవలసి వస్తుంది. గత రెండు దశాబ్దాలుగా శ్రీలంకను పాలించిన రాజపక్స కుటుంబాన్ని నెలరోజుల నిరసనలు దాదాపుగా కూల్చివేశాయి. రాజపక్సే సోదరుల్లో ఒకరు గత నెలలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయగా, మరో ఇద్దరు సోదరులు, మేనల్లుడు తమ కేబినెట్ పదవులకు అంతకుముందు రాజీనామా చేశారు.అయితే అధ్యక్షుడు గొట్బయ రాజపక్సే మాత్రం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతను కూడా రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.