మీమ్స్‌తో దాడులు.. జనానికి నవ్వులు..

రాజకీయ ప్రత్యర్థులు మాటలతో దాడులు చేసుకోవడం ఏనాటి నుండో చూస్తున్నాము. ప్రెస్ మీట్‌లోనో.. బయట సభల్లోనే తమ ప్రత్యర్థిపై మాటలతో నిలదీయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కూడా రూట్ మార్చుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్‌ (వ్యంగ్య ఫొటోలు, వీడియోలు) దాడులు చేసుకుంటున్నారు. 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ మీమ్స్ దాడులు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, హిల్లరి క్లింటన్‌లు […]

Advertisement
Update:2022-07-06 04:03 IST

రాజకీయ ప్రత్యర్థులు మాటలతో దాడులు చేసుకోవడం ఏనాటి నుండో చూస్తున్నాము. ప్రెస్ మీట్‌లోనో.. బయట సభల్లోనే తమ ప్రత్యర్థిపై మాటలతో నిలదీయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కూడా రూట్ మార్చుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్‌ (వ్యంగ్య ఫొటోలు, వీడియోలు) దాడులు చేసుకుంటున్నారు. 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ మీమ్స్ దాడులు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యాయి.

ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, హిల్లరి క్లింటన్‌లు ఒకవైపు స్పీచులతో అదరగొడుతూనే.. సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడుకున్నారు. సోషల్ మీడియా పరిధి బాగా పెరగడంతో ఈ మీమ్స్ జనాల్లోకి చొచ్చుకొని పోయాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీ టీఆర్ఎస్ బాగా ఉపయోగించుకున్నది. గత వారం అధికార టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఈ మీమ్స్ వార్ పీక్స్‌కు చేరింది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ క్రియేటివిటీ ఎదుట బీజేపీ సోషల్ మీడియా వెనుకబడిపోయింది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్, కార్యకర్తలు ఉన్న బీజేపీని ఒక స్ట్రాటజీతో టీఆర్ఎస్ దెబ్బకొట్టింది.

ఎల్బీనగర్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘మనీ హైస్ట్’ (Money Heist) పోస్టర్ జనాలకు నవ్వులు తెప్పించడమే కాకుండా.. మోడీ అండ్ కో దేశాన్ని దోచుకుంటున్నారనే మెసేజ్ బలంగా నాటుకునేలా చేసింది. 2023 ఆఖరుకు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అప్పుడే సోషల్ మీడియాలో వార్ మొదలు పెట్టాయి. కేవలం సోషల్ మీడియానే కాకుండా.. హోర్డింగ్స్‌ను కూడా మీమ్స్‌తో నింపే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి.

బీజేపీ తమ స్టేట్ ఆఫీస్ దగ్గర ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ ఒక డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి ఇన్ని రోజుల్లో కేసీఆర్ సెలవు తీసుకోబోతున్నాడంటూ.. కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఇక దీనికి దీటుగా టీఆర్ఎస్ కౌంటర్ ప్రారంభించింది. మొదట ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ మీమ్స్, హోర్డింగ్స్‌తో మొదలైన ఈ యుద్దం.. మనీ హైస్ట్‌తో పీక్స్‌కు చేరింది.

టీఆర్ఎస్ చేసిన అన్ని మీమ్స్ వెనుక ఉన్నది ఆ పార్టీ సోషల్ మీడియా. పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మీమ్స్, హోర్డింగ్స్ తయారు చేయించారు సోష‌ల్ మీడియా పెద్ద‌లు. బ్రిటానియా గుడ్‌డే బిస్కెట్లకు సంబంధించిన పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2014 ఎలక్షన్ల సమయంలో మోడీ పాపులర్ స్లోగన్ అయిన ‘అచ్చేదిన్’కు కౌంటర్‌గా ఉన్నది ఆ పోస్టర్. ఇక మనీ హైస్ట్ అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆ ఫొటో చేరింది. తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అయితే ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్‌పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిందంటే.. మీమ్స్ ఎంత బలమైనవో అర్థం అవుతోంది. ఈ హోర్డింగ్స్, మీమ్స్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలనే ప్లాన్ చేశామని పెద్ద‌లు అంటున్నారు.

ఈ మీమ్స్ అనేవి ఎన్నికల సమయంలో ఎంత మేరకు పని చేస్తాయో చెప్పలేము. ఎదుటి వ్యక్తికి వినూత్న రీతిలో సమాచారం అందించడానికి పనికి వస్తాయని ప్రొఫెసర్ కే. నాగేశ్వరరావు అంటున్నారు. కానీ ప్రజల మైండ్ సెట్ మార్చడానికి ఈ మీమ్స్ తోడ్పాటు అందించవచ్చని ఆయన అన్నారు. అతి తక్కువ సమయంలోనే సబ్జెట్ అర్థం చేయడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నారు.

మీమ్స్ అనేవి ఓటర్లపై సైకలాజికల్ ఇంపాక్ట్ చూపిస్తాయని పలు సోషల్ రీసెర్చ్ అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం మీమర్స్‌ (మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లు) కోసం చాలా డిమాండ్ ఉందని.. పొలిటిక‌ల్ పార్టీలు వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లు అంటున్నారు. ఈ మీమ్స్ దాడులు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని.. ఏపీలోని వైసీపీ, టీడీపీ మధ్య కూడా ఉందని అంటున్నారు. ఒక్కో పార్టీ దాదాపు 20 మంది మీమర్స్‌ను ఎంగేజ్ చేసుకున్నట్లు వాళ్లు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News