కేసీఆర్ స్థాయిని పెంచిన మోదీ..

9 మంది లోక్ సభ సభ్యులున్న ఓ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. దాని అధినేత కేసీఆర్. కానీ తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కేసీఆర్ ని నిజంగా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా, కేవలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రధాని మోదీ భావిస్తున్నారని అనుకోలేం.

Advertisement
Update:2022-07-05 06:18 IST

9 మంది లోక్ సభ సభ్యులున్న ఓ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. దాని అధినేత కేసీఆర్. కానీ తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కేసీఆర్ ని నిజంగా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా, కేవలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రధాని మోదీ భావిస్తున్నారని అనుకోలేం. 9 మంది లోక్ సభ సభ్యులున్న టీఆర్ఎస్ ని చూసి 300కి పైగా స్థానాలున్న బీజేపీ లోక్ సభాపక్షనేత జాగ్రత్తపడుతున్నారంటే అందులో విషయం ఏదో ఉంది. అదే తెలంగాణ బీజేపీ బహిరంగ సభలో బయటపడింది.

బీజేపీ సభలో అమిత్ షా నుంచి నడ్డా వరకు, పీయూష్ గోయల్ నుంచి బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి నుంచి స్మృతి ఇరానీ వరకు నేతలంతా కేసీఆర్ పై విమర్శల తూటాలు ఎక్కు పెట్టారు. అయితే ముగింపు ప్రసంగంలో మోదీ మాత్రం వ్యూహాత్మకంగా కేసీఆర్ టాపిక్ పక్కనపెట్టారు. టీఆర్ఎస్ పేరు కూడా ఎత్తకుండా మోదీ చేసిన ప్రసంగం బీజేపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరచింది. విజయవంతమైన సినిమాకి దీన్ని యాంటీ క్లైమాక్స్ గా భావిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఇక్కడే మోదీ వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ కూటమిని సిద్ధం చేయాలని, అందులో భాగంగా జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ని ఆవిర్భవింపజేయాలనుకుంటున్న కేసీఆర్ ఆలోచనలు.. ఆచరణలోకి రాకుండా చేసేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ని తమ సమావేశాలకు ఎంపిక చేసుకుంది. తమ బలం ఇదీ అని చూపించడానికి జాతీయ నాయకులందర్నీ రంగంలోగి దింపింది. కేసీఆర్ ఒక్కరే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిసొస్తున్నారు. కానీ ఇప్పుడు కమలం ముఠా తెలంగాణలో అడుగు పెట్టి తమ స్థాయి ఇదీ అని చూపించింది.


P2P ప్లాన్..


తెలంగాణలో కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనే తన P2P ప్లాన్ అమలు చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 4 లోక్‌ సభ స్థానాల్లో గెలిచి, ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేడయం, జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ కి పెద్ద షాకివ్వడం.. ఇలా అన్నీ మంచి శకునములే అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది. దీన్ని మరింతగా విస్తృత పరచి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్ నుంచి అధికారాన్ని లాక్కోవాలనేది ఆ పార్టీ ఆలోచన. ఈ ప్లాన్ లో భాగంగా ముందుగా టీఆర్ఎస్ ని భయపెట్టాలి, అంటే తెలంగాణ గడ్డపైనే వారు భయపడేలా పెద్ద కార్యక్రమం చేపట్టాలి, జాతీయ నాయకులందర్నీ తీసుకు రావాలి. దానికోసమే కార్యవర్గ సమావేశాలు పెట్టారు, తమ బలప్రదర్శన చేపట్టారు.


టీఆర్ఎస్ టిట్ ఫర్ టాట్..


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అనగానే టీఆర్ఎస్ వణికిపోలేదు, ముందు నిశ్శబ్దం పాటించింది, ఆ తర్వాత బీజేపీ శ్రేణుల్ని హడలెత్తించింది. సరిగ్గా సమావేశాలకు రెండురోజుల ముందు తన కార్యాచరణ అమలులో పెట్టింది టీఆర్ఎస్. హైదరాబాద్ లో అన్ని హోర్డింగ్ లపై టీఆర్ఎస్ పథకాలు దర్శనమిచ్చాయి. తెలంగాణకు స్వాగతం అంటూనే.. తమ పథకాలను వారికి తెలిసేలా చేశారు కేసీఆర్.

అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలులో లేవని పరోక్షంగా వారిని విమర్శించారు. టీవీలు, పేపర్ యాడ్ లు.. ఇలా అన్నిటినీ వాడుకుంటూ బీజేపీకి చుక్కలు చూపించారు. దీంతో సహజంగానే బీజేపీ నేతలు ఉడుక్కున్నారు. మోదీపై సెటైరిక్ గా వెలిసిన పోస్టర్లు, బ్యానర్లు, స్టాండింగ్ ప్లకార్డ్ లు.. అన్నీ చురుక్కుమనిపించాయి.

కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ ను కాషాయవర్ణంతో నింపేద్దామని బీజేపీ అనుకుంటే, అదే రోజు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తో అతి పెద్ద కార్యక్రమం చేపట్టి, బైక్ ర్యాలీలతో హోరెత్తించి.. హైదరాబాద్ ని గులాబీ మయం చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఇక్కడ కూడా బీజేపీకి ఎదురు దెబ్బే తగిలింది. ముందునుంచీ కార్యవర్గ సమావేశాలపై ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన బీజేపీ.. చివరకు ఆ రెండు రోజులు టీఆర్ఎస్ ముందు బేలగా మారింది.

యశ్వంత్ సిన్హా కార్యక్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగం కూడా బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. చివరకు కేసీఆర్ వేసిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. మోదీ సైలెన్స్ వెనక అర్థాలు, పరమార్ధాలు ఎన్ని ఉన్నా కూడా.. కేసీఆర్ ముందు ఆయన గొంతు మూగబోయిందనే చెప్పాలి. ఇక "#JumlaKingModi" అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో మోదీ పరువు తీసేసింది. సమావేశాలు, సభలు పెట్టుకున్న సమయంలో కూడా మోదీ, బీజేపీ నేతలెవరూ సోషల్ మీడియా రచ్చతో సంతోషంగా ఉండలేకపోయారు.

అయితే మోదీ-కేసీఆర్ యుద్ధం ఇక్కడితో ముగిసిపోతుందని అనుకోలేం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తన జోలికొస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ చెప్పకనే చెప్పారు. మరి మోదీ కేసీఆర్ ని మరింతగా రెచ్చగొడతారా..? వ్యూహాత్మకంగా దెబ్బకొడతారా..? వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News