మహారాష్ట్ర: ఎన్నికల సంఘం కీలకం కానుందా..?
మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలిక రావడంతో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. ఎవరిమటుకు వారు తమదే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటి స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. రెబల్ వర్గం శివసేన-బాలాసాహెబ్ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైంది. ఉద్ధవ్ థాక్రే వర్గం దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసింది. శివసేన, బాలాసాహెబ్ పేర్లను ఎవరూ ఉపయోగించుకోకుండా చూడాలని పేర్కొంది. ఇదిలా ఉండగా తమకు అనర్హత నోటీసులు […]
మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలిక రావడంతో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. ఎవరిమటుకు వారు తమదే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటి స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు.
రెబల్ వర్గం శివసేన-బాలాసాహెబ్ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైంది. ఉద్ధవ్ థాక్రే వర్గం దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసింది. శివసేన, బాలాసాహెబ్ పేర్లను ఎవరూ ఉపయోగించుకోకుండా చూడాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా తమకు అనర్హత నోటీసులు పంపడాన్ని షిండే వర్గం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మరోవైపు ఎక్కువకాలం శిబిరం నిర్వహించడం షిండేకు కష్టమవుతుండడం, ముంబై వస్తే చూసుకుందాం అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సవాలు విసరడం, రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కేడర్ ఆందోళనలు చేస్తుండడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఎంవీఏ కూటమి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.
షిండే తనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అంటే 2/3 శాసనసభా పక్షం మద్దతు ఉందని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయానికొస్తే ఈ సమీకరణలు కీలకంగా మారనున్నాయి.
ఈ క్రమంలో శివసేన ఓనర్షిప్ పై ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఏ వర్గాన్ని నిజమైన పార్టీగా ఎలా నిర్ణయించాలి? ఇది ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశం.
రాజకీయ పార్టీల అధికారిక గుర్తింపు విషయానికి వస్తే, నిర్ణయాధికారం భారత ఎన్నికల సంఘానిదే. పార్టీ అధికారం, ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ , కేటాయింపు) ఆర్డర్, వంటి విషయాలకు సంబంధించి 1968లోని 15వ పేరాలో పొందుపరచబడింది. ఈ నిబంధన ప్రకారం.. ఇటువంటి సమస్య ఎన్నికల సంఘం(ఈసీ) ముందుకు వచ్చినప్పుడు ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి వారి వాదనలను సాక్ష్యాలతో సహా వింటుందని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఈ ప్రక్రియ అంత తేలికైనదేమీ కాదు. వారు చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి మాత్రమే గాక పార్టీలోని ఆఫీస్ బేరర్లు, డెలిగేట్స్ ఇచ్చే సమాచారాన్ని కూడా ఈసీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
శివసేన సంక్షోభం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది, ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఆయన విడిపోవడానికి మిగిలిన పార్టీలో అతనికి ఎంత మద్దతు ఉందో చూడాలి.
ఇటువంటి విషయాలపై హైకోర్టులు, సుప్రీం కోర్టులలో వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఒకరు మాట్లాడుతూ.. ‘శాసనసభా పక్షంలో ఎవరు ఎక్కువ మద్దతు పొందగలరు అన్న విషయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అసెంబ్లీలో జరిగే ఈ పరీక్షలో ఉద్ధవ్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు పొందగలిగితే ఆయన ఈసీని ఆశ్రయించవచ్చు. అలా కాకుండా షిండే తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోగలిగితే మాత్రం ఉద్ధవ్ కు కష్టమవుతుందని అన్నారాయన.
కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది?
ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉన్నప్పటికీ, ఈ విషయం వారికి ఎప్పుడు చేరుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఉద్ధవ్ థాక్రే వర్గానికి సంబంధించి, ఈసీని సంప్రదించకుండా, స్పీకర్‌ను సంప్రదించడం ద్వారా తిరుగుబాటుదారులపై అనర్హత వేటు వేయాలని కోరడం సమంజసం.
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నందున అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనలను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవి పూర్తిగా తటస్థంగా ఉండవలసి ఉంది. జిర్వాల్ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉద్ధవ్ థాక్రే కూటమి భాగస్వామి అయిన ఎన్‌సీపీ సభ్యుడు. సిట్టింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.
చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ నవీన్ చావ్లా మాట్లాడుతూ.. ఈ సమస్య ఈసీ వద్ద తేలదని, చివరికి సభా వేదికపై స్పీకర్/డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ స్పీకర్ ఏమి చేస్తారనే దానిపై ఆధారపడి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, బొంబాయి హైకోర్టు సుప్రీంకోర్టు లను ఆశ్రయించే అవకాశం ఉంది. షిండే వర్గానికి గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తే మరింత గందరగోళం చెలరేగి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఒత్తిడి చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నారు.