కుప్పంలో బెంగాల్ వ్యూహం రె’ఢీ’చేస్తున్న వైసీపీ.. రంగంలోకి సినీనటుడు?
తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన స్వంత నియోజకవర్గంలో ఓడించి నైతికంగా దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కొంతమేర విజయం సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. […]
తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన స్వంత నియోజకవర్గంలో ఓడించి నైతికంగా దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కొంతమేర విజయం సాధించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వారికి చెక్ పెట్టేందుకు వైసీపీ దీటైన అభ్యర్థుల వేటను ప్రారంభించింది.
చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో ఆయన్ను ఓడించేందుకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. బెంగాల్ లో మమతా బెనర్జీని నందిగ్రామ్ లో ఓడించేందుకు సువేందు అధికారిని బీజేపీ రంగంలోకి దించింది.
అక్కడ పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేసి ఆమెను రెచ్చగొట్టేవ్యాఖ్యలతో నందిగ్రామ్ నుంచి దృష్టి మరల్చకుండా చేసింది బీజేపీ. దాంతో ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని నందిగ్రామ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించింది. అయినా ఓడిపోక తప్పలేదు.
కుప్పంలోనూ చంద్రబాబును ఓడించేందుకు బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని వైసిపి యోచిస్తోంది. దీంతో ఆయన కుప్పం పైనే ఎక్కువ దృష్టి సారించి ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయకుండా చూడాలనేది వైసిపి వ్యూహం. ఇదే స్ట్రాటజీని లోకేష్ పోటీ చేసే మంగళగిరిలోనూ అమలు చేయాలని భావిస్తోంది.
తెరపైకి ఆ సినీ నటుడి పేరు!
కుప్పం కోసం ఇప్పటికే వైసీపీ పలువురి పేర్లను పరిశీలిస్తోంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని కానీ, ఎమ్మెల్సీ భరత్ ను పోటీ చేయించాలనుకున్నారు. వీరి పేర్లతో పాటు బలమైన పలువురు బీసీ అభ్యర్ధుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
ఒక్క అవకాశం కూడా చంద్రబాబుకు ఇవ్వకుండా ఉండాలంటే వీరికంటే ఇంకా బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషణ సాగిస్తోంది. నియోజకవర్గంలో తమిళ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నందున ఈ క్రమంలో సినీ నటుడు విశాల్ పేరు తెర పైకి వచ్చింది. తమిళ, తెలుగు ప్రజలకు విశాల్ తన సినిమాల ద్వారా సుపరిచితుడు కావడంతో పాటు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారవడంతో ఆయన పేరును కూడా పరిశీస్తున్నట్టు తెలుస్తోంది.
విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్ గా, రియల్టర్ గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. విశాల్ సొంత ఊరు కుప్పం నియోజకవర్గంలోనే ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు కూడా నచ్చిందట.
విశాల్‌కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఎక్కువే. ఆయన తమిళ నటుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడని చెబుతున్నారు. జగన్ అన్నింటా విజయం సాధించాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని విశాల్ పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
అయితే ఈ ప్రతిపాదనను ఇంతకీ వైసీపీ విశాల్ దృష్టికి తెచ్చిందా..ఆయన దీనిపై ఎలా స్పందించారనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ఇదంతా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చా లేక గ్యాసిప్ గానే మిగిలిపోతుందా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.