కేసీఆర్ అప్రమత్తత – ఉద్ధవ్ అజాగ్రత్త !

“కాబోయే ముఖ్యమంత్రి” అంటూ గత ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్ షిండే 58వ పుట్టినరోజున పోస్ట‌ర్లు వెలిశాయి. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నశివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు..? అని గూగుల్ లో నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. ”కాబోయే ముఖ్యమంత్రి”అని పోస్టర్లు,హోర్డింగులు ప్రత్యక్షమై కనీసం ఐదు నెలలు గడిచాయి. ఆయన ఏమి చేస్తున్నారు? ఆయన ఆలోచనలు ఏమిటి? ఆయన ఎవరెవరితో సంభాషిస్తున్నారు? గుట్టుగా ఏ వ్యవహారం నడుపుతున్నారు? అనే అంశాలపై […]

Advertisement
Update:2022-06-24 13:27 IST

“కాబోయే ముఖ్యమంత్రి” అంటూ గత ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్ షిండే 58వ పుట్టినరోజున పోస్ట‌ర్లు వెలిశాయి. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నశివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు..? అని గూగుల్ లో నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. ”కాబోయే ముఖ్యమంత్రి”అని పోస్టర్లు,హోర్డింగులు ప్రత్యక్షమై కనీసం ఐదు నెలలు గడిచాయి. ఆయన ఏమి చేస్తున్నారు? ఆయన ఆలోచనలు ఏమిటి? ఆయన ఎవరెవరితో సంభాషిస్తున్నారు? గుట్టుగా ఏ వ్యవహారం నడుపుతున్నారు? అనే అంశాలపై ఇంటెలిజెన్సు వర్గాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి? ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా విఫలమైంది? ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నలివి. ‘పొలిటికల్ ఇంటెలిజెన్స్’ విభాగం ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. మహారాష్ట్రలో ఆ విభాగం ‘అచేతనావస్థ’లోకి చేరుకున్నట్టు తిరుగుబాటు ఎమ్మెల్యేల కార్యకలాపాలు రుజువు చేస్తున్నాయి.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఓటుకు నోటు కేసు' ఘటన జరిగిన వెంటనే కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అప్పటికే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘అడ్వాన్సు’ డబ్బు కూడా ముట్టింది. కేసీఆర్ 2014లో 63 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కు మరో 3 సీట్లు మాత్రమే అధికం. కనుక ఈ బలాన్ని అస్థిరపరచడం చాలా సులభమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంచనా వేసి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు కన్నా రెండాకులు ఎక్కువ చదివిన కేసీఆర్ ‘ముందస్తు’ జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ నుంచి ‘అడ్వాన్సు’తీసుకున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలను పిలిపించి వారి నుంచి ఆ డబ్బు కక్కించినట్టు అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి.

‘ఓటుకు నోటు కేసు’ వెలుగు చూడడం వెనుక మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అందించిన సమాచారం ప్రధానం. బహుశా ఆయనకు ఎవరో ‘నిఘా వర్గాల’వారే ఉప్పందించి ఉంటారు. సరే,ఏమైనా ఆనాడు ప్రభుత్వం తృటిలో ‘అస్థిర’గండం నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ అప్రమత్తత ముఖ్యమైంది. అసలే కేసీఆర్.. ఆయన చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టే రకం. అది మళ్ళీ ప్రాణం పోసుకునే అవకాశాలు లేకుండా పూర్తిగా సర్వనాశనం చేసే మనిషి కేసీఆర్.

మహారాష్ట్రలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రణాళికలను బీజేపీ రూపొందించింది. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న శివసేన నాయకుడు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి షిండే బీజేపీ చేతికి ‘బ్రహ్మాస్త్రం’లా దొరికారు. 10 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పదవికే ఎసరు తెచ్చాయి. నలుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకోగలిగిన బలం ఉన్న బీజేపీ అయిదుగురిని గెలిపించుకోగలినప్పుడే ‘రాజకీయ సంక్షోభాని’కి తెరలేచింది. కానీ అంతకుముందే కుట్రపూరిత ‘కార్యాచరణ ప్రణాళిక’ను ఢిల్లీ, ముంబబైల‌లో ఎట్లా అమలు చేయాలో కసరత్తు పూర్తయింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే ప్లానింగ్ జరగకపోతే ఏక్ నాథ్ షిండే పలువురు శివసేన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గుజరాత్ లోని సూరత్ కు ఎట్లా వెళ్ళగలరు? అక్కడి నుంచి అస్సోం రాజధాని గౌహ‌తికి ఎట్లా వెళతారు? శివసేన పార్టీలో చీలిక తీసుకురావడం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం రాత్రికి రాత్రే జరిగిన పథకం కాదు. ఇంత జరుగుతున్నా నిఘా సంస్థలు ఎందుకు నిద్రపోయాయో తెలియదు. లేదా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్ లో ఆయా సంస్థలు నిద్ర నటిస్తూ ఉండాలి.

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యతిరేకించినందుకే ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది. ‘మాహా వికాస్ అఘాడి’లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఉన్నాయి. శరద్ పవార్ కారణంగానే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి షిండే లోలోపల రగిలిపోతూనే ఉన్నారు. సరైన సమయం కోసం ఆయన కాచుకొని ఉన్నారు. ఆయన కదలికలు, కార్యకలాపాలు, సమావేశాలపై థాక్రే ప్రభుత్వం ఎందుకు కన్ను వేయలేదో అర్ధం కాదు. షిండేను ఉద్ధవ్ థాక్రే అసలు లెక్కలోకి తీసుకోలేదా? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ముందు చూపు లేదని అనుకోవాలి. ‘పొగ’రాకముందే ‘నిప్పు కనిపెట్టగలిగిన కేసీఆర్ వంటి నాయకుడు కాదని తేలిపోయింది.

శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే 2004, 2009, 2014, 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ పార్టీలో ‘మాస్ లీడర్. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే నుంచి ఉద్దవ్ థాక్రే వరకు ఆ కుటుంబానికి నమ్మినబంటు. ఆటోడ్రైవ‌ర్ నుంచి మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి షిండే అవతరించడం భారత రాజకీయాల ‘డొల్ల తనాన్ని’బయటపెడుతుంది. ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు నడిచిన క్యాంపు రాజకీయాలు, రిసార్టులలో వ్యవహారాలన్నీ షిండే చక్కబెట్టాడంటే ఆయన సమర్ధత, నాయకత్వ శైలి, దూకుడు తత్వం, అపరిమితమైన సంపద కారణం. కాగా ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే పార్లమెంటు సభ్యుడుగా ఉన్నాడు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో థానేలోని ‘శివసైనికులు’ షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కానీ, శివ‌సేన థాక్రే వార‌సుల గుప్పిట్లో బ‌లంగా ఉన్నందున ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయినప్పుడు ధిక్కరించకపోవడం ‘వ్యూహాత్మకమే’నని తాజా పరిణామాలను బట్టి విశ్లేషించవచ్చు. సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కొడుకు ఆదిత్య పార్టీలోకి వ‌చ్చిన నాటి నుంచి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌న్న‌ విమ‌ర్శ‌లున్నాయి.

అయితే శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రగులుకునేంత వరకూ షిండే వేచి చూశారు. ఇంటలిజెన్స్ వ్యవస్థకు కూడా అందకుండా షిండే ప్లాన్ చేయడం వల్లనే 37 మంది ఎమ్మెల్యేలను తన గూటికి రప్పించుకోగలిగారు.

‘హిందుత్వం’తో పెనవేసుకుపోయిన శివసేన రాజకీయ పార్టీ కాదు. బాల్ థాక్రే శివసేనను హిందుత్వ పార్టీగా నిర్మించారు. హిందువులకు అండగా నిలబడుతూనే మహారాష్ట్రలో ఆ పార్టీ బలోపేతమైంది. అధికారం కోసం ‘హిందుత్వా’న్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీ ఎదుట శివసేన పార్టీ మోకరిల్లిందని అప్పట్లో విమర్శలు వెలువడ్డాయి. వాటిని ఉద్ధవ్ థాక్రే పెద్దగా ఖాతరు చేయలేదు. సరిగ్గా ప్రస్తుతం అదే అస్త్రాన్ని షిండే అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ‘శివసేన’తన మూలాలను విస్మరించిందనే అంశాన్ని ‘ఏకు మేకైన’ ఏక్ నాథ్ ముందుకు తీసుకువస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News