‘బీజేపీ నేతలు సుద్దులు చెప్పడ‍ం మాని, కిసాన్ సమ్మాన్ యోజనలో కొత్త వారికి అవకాశం కల్పించండి’

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంపై తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అది కూడా 35.74 లక్షల మందికే ప్రయోజనం చేకూరుతుందని సింగిరెడ్డి అన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారని, ఒక్కొక్క రైతు 10 వేల రూపాయలు పొందుతున్నారని ఆయన ఓ ప్రకటన‌లో తెలిపారు రైతుబంధు […]

Advertisement
Update:2022-06-23 11:42 IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంపై తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అది కూడా 35.74 లక్షల మందికే ప్రయోజనం చేకూరుతుందని సింగిరెడ్డి అన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారని, ఒక్కొక్క రైతు 10 వేల రూపాయలు పొందుతున్నారని ఆయన ఓ ప్రకటన‌లో తెలిపారు

రైతుబంధు పథకం కింద ఈ వానాకాలం సీజన్ తో కలుపుకుంటే రూ.58 వేల కోట్ల నిధులు తెలంగాణ రైతుల ఖాతాలలోకి వెళ్ళాయని చెప్పిన నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల కోట్లు రైతుబంధు కింద ఖర్చు చేస్తున్నదని అన్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటి వరకు రైతులకు అందింది రూ.7689 కోట్లు మాత్రమే అని, ఆ పథకంలో కొత్తవారి నమోదుకు అవకాశం లేదని, ఫిబ్రవరి 1, 2019 తర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదని ఆయన ఆరోపించారు.

రైతుబంధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయం అందిస్తున్నామని, అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు కూడా రైతుబంధు సాయం అందించడం జరుగుతున్నదని ఆయన చెప్పారు.రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాలలో వేయడం మూలంగా రైతులు ఆ డబ్బులను తమ‌ వ్యవసాయ అవసరాల మేరకు వాడుకునే అవకాశం ఉన్నదని నిరంజన్ రెడ్డి అన్నారు.

కేంద్రం అడ్డగోలు నిబంధనల మూలంగా ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రయోజనాలు అందడం లేదని, ఎరువుల మీద సబ్సిడీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని, ఎనిమిదేళ్లలో ఎరువులు, రసాయనాల ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన ఆరోపించారు.

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ వ్యవసాయరంగంలో యంత్రాల వినియోగంపై భారం మోపుతున్నారని, 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ .. రైతుల పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయడంలో విజయవంతం అయ్యారని నిరంజన్ రెడ్డి విమర్షించారు. కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చేది తక్కువ ప్రచారం ఎక్కువ అని ఆయన అన్నారు.

బీజేపీ నేతలు మందికి సుద్దులు చెప్పడం మానేసి ప్రధానమంత్రికి చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో నిబంధనలు వెంటనే సడలించి. ప్రతి రైతుకూ ఈ పథకం వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News