సికిందరాబాద్ అగ్నిపథ్ నిరసనలు: 20 కోట్ల ఆస్తి నష్టం…మెట్రో సహా 71 రైళ్ళు రద్దు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగుల ఆందోళన రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపారు. పోలీసుల చర్య వల్ల ఒకరు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. 20 మందికిపైగా తీవ్రగాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఆందోళనకారుల […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగుల ఆందోళన రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపారు. పోలీసుల చర్య వల్ల ఒకరు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. 20 మందికిపైగా తీవ్రగాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది.
ఆందోళనకారుల హింస వల్ల 20 కోట్ల రూపాయల మేర రైల్వే ఆస్తికి నష్టం కలిగిందని సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు.
మరో వైపు రైల్వే స్టేషన్లో హింస నేపథ్యంలో శుక్రవారం అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ లో మెట్రో రైళ్ళను కూడా రద్దుచేసినట్టు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు.
సికిందరాబాద్ లో జరిగిన హింస నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే స్టేషన్ లలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. తెలంగాణలో హైదరాబాద్ లోని నాంపల్లి, వరంగల్, ఖాజీపేట, నిజామాబాద్, డోర్నకల్, మహబూబాబాద్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు.
ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌లో హై సెక్యూరిటీ పెట్టారు.
మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్-ధన్‌పూర్, హైదరాబాద్-షాలిపూర్ ఈస్ట్‌కోస్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. స్టేషన్లలోకి పోలీసులు ఎవరిని అనుమతించడంలేదు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.