వామ్మో..నమో..!
పార్టీలో ఓ సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్న నరేంద్ర మోడీ చాణక్యం అబ్బుర పరుస్తుంది. ఎదుగుదల క్రమంలో ఆయన పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్ళు ఆయన్ను రాటు దేల్చాయి. ఇందుకోసమే ఆయన కరివేపాకు, నిచ్చెన సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే ప్రధాని అభ్యర్ధిగా ఉద్దండులైన నాయకులతోనే ప్రతిపాదించుకోగలిగారు. ఇక అంతే అందరికీ ఆయన విశ్వరూప దర్శనం కల్పించారు. ఒకప్పుడు వ్యక్తుల కంటే పార్టీ, సిద్ధాంతాలే ముఖ్యం అంటూ చెప్పుకున్న […]
పార్టీలో ఓ సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్న నరేంద్ర మోడీ చాణక్యం అబ్బుర పరుస్తుంది. ఎదుగుదల క్రమంలో ఆయన పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్ళు ఆయన్ను రాటు దేల్చాయి. ఇందుకోసమే ఆయన కరివేపాకు, నిచ్చెన సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే ప్రధాని అభ్యర్ధిగా ఉద్దండులైన నాయకులతోనే ప్రతిపాదించుకోగలిగారు. ఇక అంతే అందరికీ ఆయన విశ్వరూప దర్శనం కల్పించారు. ఒకప్పుడు వ్యక్తుల కంటే పార్టీ, సిద్ధాంతాలే ముఖ్యం అంటూ చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ.. నేడు ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతూ రాజకీయం నడుపుతున్నదంటే తప్పెవరిది.. శక్తి ఎవరిది అనే ప్రశ్నలు రాక మానవు. మొత్తం పార్టీపై పట్టుసాధించి ప్రతీ నాయకుడిని తన కనుసన్నల్లో ఉంచుకునే స్థాయికి చేరుకుని అందరితో నమో..నమో ( నరేంద్ర మోడీ) అనిపించుకుంటున్నారు.
ఈ క్రమంలో పార్టీలో ఉన్న సీనియర్లను సైతం ఎంతో చాకచక్యంగా, నేర్పుగా పక్కనబెట్టిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వ్యక్తిపూజకు వ్యతిరేకమని చాటుకున్న బీజేపీని విజయవంతంగా ఆ దిశగా నడిపిస్తున్నారని వాదించేవారు కూడా లేకపోలేదు. తన రాజకీయ గురువు ఎల్. కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులకు ప్రాధాన్యం లేకుండా, తనకు అడ్డు రాకుండా చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కారణాలు ఏమైనా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక ఉత్తర భారతంలో కూడా చలాయించుకురాగల సీనియర్ నాయకుడు విద్యార్ధి దశనుంచే పార్టీతో కలిసి నడిచిన వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులను కూడా చాలా సులువుగా పక్కన బెట్టారంటే ఎంతటి రాజకీయ చతురతను ప్రయోగించగలరో అర్ధం చేసుకోవచ్చు. తనకు అవసరమైన సమయాల్లో అవసరమైన వ్యక్తులను ఎలా అక్కున చేర్చుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ అంటారు.
వెంకయ్యనాయుడికి మొండిచెయ్యేనా!
తన వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటూనే తాను అనుకున్నది సాధించుకునే దిట్ట అని పేరుగాంచారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన మరోసారి తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం లభిస్తుందని మొదట భావించారు. కానీ ఆయన తన ప్రాధాన్యాలను మార్చుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి పనికివచ్చేలా తద్వారా ఆయా వర్గాలను దగ్గరకు చేర్చుకునే ఎత్తుగడలో భాగంగా మైనారిటీ, గిరిజన, మహిళా అభ్యర్ధుల పేర్లను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు పరిశీలిస్తున్నారు. వీరిలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ కోటాలోనూ, మహిళా కోటాలోనూ కలిసి వచ్చేట్టుగా గవర్నర్ గా పనిచేసిన ద్రౌపది ముర్ము పేరును పరిశీలిస్తున్నారు.
కానీ, అగ్రవర్ణాలను సంతృప్తి పరచాలన్న ఆలోచన తెరపైకి రావడంతో ముర్ము పేరు వెనక్కి వెళ్ళొచ్చని వినిపిస్తోంది. అగ్ర వర్ణాలకే పదవి ఇవ్వదల్చుకుంటే కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత పశ్చిమ బెంగాల్ కు చెందిన దినేష్ త్రివేది పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక ఉప రాష్ట్రపతి పదవిని మైనారిటీ వర్గాలకు కేటాయించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వి పేరు వినిపిస్తోంది. ఇందుకోసమే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదని టాక్ కూడా నడుస్తోంది. అలాగే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మైనారిటీ వ్యక్తినే ప్రతిపాదించేందుకు బీజేపీ సిద్ధమైందని సమాచారం. ఈనెల 25వ తేదీలోగా రెండు పదవులకు అభ్యర్ధులను ఖరారు చేసి మోడీ పర్యటనకు వెళతారని అంటున్నారు.
విచిత్రం ఏంటంటే.. బీజేపీని వెనకుండి నడిపిస్తుందనుకునే సంఘ్ పరివార్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ ఎస్ ఎస్) కూడా నరేంద్రమోడీని కాదని నిర్ణయాలు తీసుకోలేకపోవడం మోడీ వైఖరికి నిదర్శనమని పలు సందర్భాలను ఉంటంకించేవారు లేకపోలేదు. అన్ని విషయాల్లోనూ ఇలా మొదటినుంచీ ఎక్కడికక్కడ తనకు ఇష్టంలేని వ్యక్తులను ఏదోఒక సాకుతో పక్కనబెడుతూ రాజకీయం నడిపిస్తున్న నరేంద్ర మోడీని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.