తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయండి

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Advertisement
Update:2025-01-20 19:56 IST

తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం చేయడంతో పాటు వాటికి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. సోమవారం ఒడిషాలోని కోణార్క్‌లో నిర్వహించిన మైనింగ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో పాల్గొన్న భట్టి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. 2016లో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, 2022లో ప్రధాని మోదీ విజయ సంకల్ప సభలో 350 కి.మీ.ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. రూ.34,367.62 కోట్లతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు దక్షిణ కారిడార్‌ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ మెట్రో కారిడార్‌లో కొత్తగా 10 గ్రీన్‌ ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లను రూ.45 వేల కోట్లతో ప్రతిపాదించామని, వాటికి అనుమతి ఇవ్వడంతో పాటు కేంద్రం నుంచి సాయం చేయాలని కోరారు. రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ.ల మేర చేపట్టబోయే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌ -2 ప్రాజెక్టు, రూ.14,100 కోట్లతో మూసీ నది పునరుజ్జీవం, బాపు ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ అభివృద్ధి, రూ.7,440 కోట్లతో చేపట్టబోయే గోదావరి - మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టు, రూ.17,212.68 కోట్లతో 7,444 కి.మీ.ల పొడవునా చేపట్టబోయే హైదరాబాద్‌ సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌, రూ.4,170 కోట్లతో వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ.17 వేల కోట్లతో బందరు పోర్టు నుంచి హైదరాబాద్‌ కు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం, రూ.1,63,559.31 కోట్లతో సెమీ కండక్టర్‌ తయారీ కేంద్రానికి నిధులు ఇవ్వడంతో పాటు ఆయా ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్‌ కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News