తెలంగాణకు ముంచుకొస్తున్న డెంగ్యూ ముప్పు.. పెరుగుతున్న కేసులు
కోవిడ్-19తో అల్లాడిపోయిన తెలంగాణలో ఇప్పుడు కేసులు తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ప్రతీ రోజు నమోదవుతున్నా.. అవి ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు కూడా పెద్దగా భయపడటం లేదు. అయితే, కోవిడ్ ముప్పు దాదాపు తప్పిందని భావిస్తున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు డెంగ్యూ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ప్రతీ వర్షాకాలం సీజన్‌లో డెంగ్యూ విజృంభిస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మరింత ముందుగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం […]
కోవిడ్-19తో అల్లాడిపోయిన తెలంగాణలో ఇప్పుడు కేసులు తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ప్రతీ రోజు నమోదవుతున్నా.. అవి ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు కూడా పెద్దగా భయపడటం లేదు. అయితే, కోవిడ్ ముప్పు దాదాపు తప్పిందని భావిస్తున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు డెంగ్యూ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ప్రతీ వర్షాకాలం సీజన్‌లో డెంగ్యూ విజృంభిస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మరింత ముందుగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతీ రోజు పదుల సంఖ్యలో వస్తున్నాయని ఆరోగ్య శాఖ చెప్తోంది.
రాబోయే మూడు నాలుగు వారాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దోమల పునరుత్పత్తికి అనుకూలమైన సమయం కావడంతో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 506 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం హైదరాబాద్‌లోనే 167 కేసులు నమోదు కాగా.. మిగిలిన కేసులు అదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో నమోదయినట్లు అధికారులు చెప్పారు.
ప్రస్తుతం జ్వరాల బారిన పడుతున్న వారిలో 30 నుంచి 40 శాతం మందికి డెంగ్యూ వైరస్ సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. గత నెలలో డెండ్యూ కేసులు తక్కువగానే ఉన్నాయని.. కానీ అకస్మాతుగా రెట్టింపు అయినట్లు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రాహుల్ అగర్వాల్ వివరించారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ కేసులు మరింతగా పెరుగుతాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కొత్తగూడకు చెందిన బి. శిరీష డెంగ్యూ బారిన పడింది. జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లగా డెంగ్యూ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దాంతో ఆసుపత్రిలోనే కొన్ని రోజులు చికిత్స తీసుకొని ఇంటికి వచ్చింది.
అయితే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా డెంగ్యూ బారిన పడ్డారు. 3 ఏళ్ల చిన్నారుల్లో కూడా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయని.. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని వైద్యులు అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, వికారం, వాంతులు, చర్మంపై ఎర్రని ప్యాచెస్ వంటివి డెంగ్యూ ప్రాథమిక లక్షణాలు. ఇవి ఎవరిలో అయినా బయటపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య హఠాత్తుగా పడిపోతుంది కాబట్టి.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.