గులాబి దళానికి దగ్గరవుతున్న ఎర్రదండు..
శత్రువుకి శత్రువు మిత్రుడు.. ఈ క్రమంలో బీజేపీకి శత్రువులుగా ఉన్న టీఆర్ఎస్, వామపక్షాలు ఇప్పుడు కలవబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కి వకాల్తా పుచ్చుకున్నట్టు, తెలంగాణ గవర్నర్ ని విమర్శిస్తూ.. సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణలో బీజేపీ చాలామందిని రంగంలోకి దింపింది. కేఏపాల్ ని కూడా వెనకనుంచి దువ్వుతోంది. ఈ దశలో కేసీఆర్ కి కూడా వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరిగా మారే అవకాశముంది. అందుకే […]
శత్రువుకి శత్రువు మిత్రుడు.. ఈ క్రమంలో బీజేపీకి శత్రువులుగా ఉన్న టీఆర్ఎస్, వామపక్షాలు ఇప్పుడు కలవబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కి వకాల్తా పుచ్చుకున్నట్టు, తెలంగాణ గవర్నర్ ని విమర్శిస్తూ.. సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణలో బీజేపీ చాలామందిని రంగంలోకి దింపింది. కేఏపాల్ ని కూడా వెనకనుంచి దువ్వుతోంది. ఈ దశలో కేసీఆర్ కి కూడా వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరిగా మారే అవకాశముంది. అందుకే గవర్నర్ కి వ్యతిరేకంగా సీపీఐ నారాయణ బహిరంగ విమర్శ చేసినట్టు తెలుస్తోంది.
గవర్నర్ ను కలిసి సమస్యలపై వినతిపత్రాలివ్వడం, ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం.. వంటివి సహజంగా ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంటాయి. ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరుతుంటాయి. కానీ నేరుగా గవర్నరే తాను సమస్యలు పరిష్కరిస్తానంటూ ప్రజా దర్బార్ లు పెట్టాలనుకోవడం సంప్రదాయాలకు భిన్నం. అయితే తెలంగాణలో తమ ప్రభుత్వంతో గవర్నర్ కోరి గొడవలు పెట్టుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుస సంఘటనల అనంతరం ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో వామపక్షాలు ఎంటరవ్వడమే లేటెస్ట్ ట్విస్ట్.
మహిళా దర్బార్ విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్‌భవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఓవైపు బీజేపీ రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉందని అన్నారు నారాయణ. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉందని.. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
నారాయణ వ్యాఖ్యలు గవర్నర్ వ్యవహార శైలిని తప్పుబట్టడంతోపాటు, టీఆర్ఎస్ ని సమర్థించేవిగా ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ కూడా వామపక్షాలతో కలసి పోటీ చేసిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు మరోసారి గులాబీదళానికి ఎర్రదండు దగ్గరవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే లెక్కకు మిక్కిలి పార్టీలు 2023 ఎన్నికలకోసం సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ ని నేరుగా ఢీకొనడం కష్టమని భావించిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీలతో టీఆర్ఎస్ ని చికాకు పెట్టాలనుకుంటోంది. ఈ దశలో వామపక్షాలు కూడా టీఆర్ఎస్ తో కలిస్తే.. బీజేపీ పాచిక పారడం కష్టమవుతుంది.