వారే వీడియో రికార్డ్‌ చేశారు -రేప్‌ ఘటనపై సీపీ ప్రెస్‌మీట్‌

సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ రేప్‌ ఘటనపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని ప్రకటించారు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్. మంగళవారం రాత్రి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. సీపీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ”బెంగళూరులో నివసించే ఒక బాలుడు.. స్కూల్‌ ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో ఒక పార్టీ ఏర్పాటు చేయాలని ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. ఏ పబ్‌ బాగుంటుందో ఎంపిక చేయాలని కోరాడు. పార్టీ నిర్వహించాలన్న ప్లాన్‌ […]

Advertisement
Update:2022-06-07 17:33 IST

సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ రేప్‌ ఘటనపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని ప్రకటించారు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్. మంగళవారం రాత్రి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.

సీపీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం..
”బెంగళూరులో నివసించే ఒక బాలుడు.. స్కూల్‌ ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో ఒక పార్టీ ఏర్పాటు చేయాలని ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. ఏ పబ్‌ బాగుంటుందో ఎంపిక చేయాలని కోరాడు. పార్టీ నిర్వహించాలన్న ప్లాన్‌ మార్చిలోనే మొదలైంది. ఏప్రిల్‌లో తొలుత పార్టీ గురించి ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

మే నెల రెండో వారంలో మరోసారి ఇన్‌స్టాలో పార్టీ గురించి పోస్టు చేశారు.. మే 25న బెంగళూరు నుంచి వచ్చి పబ్‌కు అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు చెల్లించారు. పార్టీ చేసుకుందామంటూ ఇతరుల నుంచి ఫీజు వసూలు చేశారు. బాధితురాలు కూడా రూ. 1300 ఎంట్రీ ఫీజు చెల్లించింది. మే 28న అత్యాచార ఘటన జరిగింది. మే 28న ఘటన జరిగినప్పటికీ మే 31 సాయంత్రం వరకు ఎవరికీ బాధితురాలు చెప్పలేదు. దాదాపు 72 గంటల పాటు ఎవరికీ తెలియదు. అమ్మాయి మెడపై గాయాలుండడంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించారు. మహిళా పోలీసు అధికారులు బాధితురాలికి ధైర్యం చెప్పడంతో వివరాలను బాధితురాలు బయటకు వెల్లడించింది.

జూన్‌ రెండున నిందితులను సీపీ ఫుటేజ్‌ సాయంతో గుర్తించాం. బాధితురాలు ఒక్క వ్యక్తిని మాత్రమే గుర్తించింది. మిగిలిన వారిని సీసీ పుటేజ్‌ సాయంతో మేమే గుర్తించాం. ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్‌ను జూన్‌ 3న అరెస్ట్ చేశాం. సాదుద్దీన్‌తో పాటు మరో నలుగురు మైనర్లు బాధితురాలిపై అత్యాచారం చేశారు.

మే 28న మధ్యాహ్నం 1.10 నిమిషాలకు బాధితురాలు, మరో బాలుడు కలిసి పబ్‌లోకి వెళ్లారు. 1.50 నిమిషాల వరకు అతడితో కలిసి బాలిక డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత స్నేహితుడు వెళ్లిపోగా.. ఆ అమ్మాయిని మేజర్‌ అయిన సాదుద్దీన్‌తో పాటు మరో మైనర్‌ వేధించడం మొదలుపెట్టారు.

వేధింపులు ఎక్కువ కావడంతో సాయంత్రం 5.40కి బాధితురాలు, ఆమె స్నేహితురాలు పబ్‌ నుంచి బయటకు వచ్చేశారు. బాధితురాలి స్నేహితురాలు క్యాబ్‌లో వెళ్లిపోగా.. బాధితురాలిని నిందితులు ట్రాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. పబ్‌లోనే అమ్మాయిని ట్రాప్ చేయాలన్న కుట్రకు ప్లాన్‌ చేశారు.

బెంజ్‌ కారులోని నలుగురు మైనర్లు ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిని బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు. వీడియోలు కూడా మైనర్లే తీసి వాట్సాప్‌లో షేర్ చేశారు. బెంజ్‌ కారును ఇన్నోవాలో ఇతర నిందితులు ఫాలో అయ్యారు. జూబ్లిహిల్స్‌ పెద్దమ్మ గుడికి సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి కారును తీసుకెళ్లి అక్కడే అమ్మాయిపై వరుసగా ఐదుగురు అత్యాచారం చేశారు. ఆ సమయంలో బాధితురాలికి మెడతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. తర్వాత 7 గంటల 31 నిమిషాలకు ఇన్నోవా కారులో తిరిగి వచ్చి అమ్మాయిని పబ్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 7.53కి ఆమె తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లారు” అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఈకేసులో దర్యాప్తు పూర్తయిందని.. అవసరమైన ప్రతి ఆధారాన్నిపక్కగా సేకరించామన్నారు. ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ మాత్రమే మేజర్‌ అని వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగడం లేదన్నారు. మీడియా ఆలోచన ప్రకారం కేసు ఉండాలంటే కుదరదన్నారు. నిందితులపై గ్యాంగ్ రేప్‌, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో మరణ శిక్ష లేదా, 20ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. కేసులో బలమైన ఆధారాలే లభించాయన్నారు.

నిందితులంతా ఒకే గ్రూప్ అయినప్పటికీ వారి మధ్య కూడా విబేధాలున్నాయని, ఆధిపత్యం ఉందని.. అందుకే భవిష్యత్తులో పనికొస్తాయన్న ఉద్దేశంతో ఒకరికొకరు వీడియో తీసుకున్నారని.. తాము ఇలా చేస్తున్నామని హీరోయిజంగా చెప్పుకునేందుకు కూడా వీడియోలు తీశారన్నారు. కానీ ఆ తర్వాత ఒకరికొకరు వీడియోలను వారే బయటపెట్టుకున్నారని సీపీ వివరించారు.

Tags:    
Advertisement

Similar News