సై అన్న బీజేపీ.. జనసేన సపోర్ట్ లేకుండానే ఆత్మకూరులో పోటీ..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ ఖాయం అని గతంలోనే బీజేపీ చెప్పినా అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. వైసీపీ స్థాయిలో కాకపోయినా.. బీజేపీ కూడా నామినేషన్ కార్యక్రమానికి మేళ తాళాలతో హంగామా చేసింది. పవన్ ప్రకటన మరుసటి […]
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ ఖాయం అని గతంలోనే బీజేపీ చెప్పినా అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. వైసీపీ స్థాయిలో కాకపోయినా.. బీజేపీ కూడా నామినేషన్ కార్యక్రమానికి మేళ తాళాలతో హంగామా చేసింది.
పవన్ ప్రకటన మరుసటి రోజే..
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రకటన రోజు నుంచీ బీజేపీ అభ్యర్థి విషయంలో సమాలోచనలు జరుపుతోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి బీజేపీ తరపున టికెట్ ఆశించారు. ఇటీవలే ఆ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. కానీ హడావిడిగా వచ్చి చేరిన వారికి టికెట్ ఇచ్చారనే అపవాదు లేకుండా బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ని ఒప్పించి మరీ నామినేషన్ వేయించింది. అయితే ఆత్మకూరులో జనసేన పోటీ చేయదని, అది తమ విధానం అంటూ పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ నామినేషన్ వేయడం విశేషం. వైసీపీని వ్యతిరేకించే పార్టీలన్నీ తమ ఆత్మ సాక్షిగా బీజేపీకి ఓటు వేయాలంటూ.. పరోక్షంగా జనసేనకు చురకలంటించారు సోము వీర్రాజు.
బీసీ అభ్యర్థిని నిలబెట్టాం..
వైసీపీకి దమ్ముంటే.. ఆత్మకూరులో మంత్రులను ఇన్ చార్జిలుగా పెట్టకూడదని అన్నారు సోము వీర్రాజు. ఓట్లు కొనకుండా నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు సహకరించాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక సీట్లిచ్చామంటూ బస్సు యాత్ర చేసిన వైసీపీ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీసీలకు సీటెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు వీర్రాజు. రాజకీయాలను కుటుంబ వ్యవహారాలుగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో బీజేపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టిందని, ఆయనకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు వీర్రాజు.
అధికార పార్టీ టార్గెట్ లక్ష మెజార్టీ..
మరోవైపు అధికార వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీకోసం కృషి చేస్తోంది. ఇప్పటికే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు రూరల్ ప్రాంతాల్లో ప్రచార జోరు పెంచారు. పల్లె పల్లెకూ వెళ్లి ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఆయన చాలా ప్రాంతాలను కవర్ చేశారు. ఇక బీజేపీ కొత్తగా జనాల్లోకి వెళ్లాల్సి ఉంది. భరత్ కుమార్ ఆత్మకూరు ప్రజలకు పరిచయం లేకపోవడం కూడా బీజేపీకి మైనస్ గా చెప్పుకోవాలి.