చోటా సచిన్ కు బడా కష్టాలు! అర్జున్ కు అందనిద్రాక్షలా ఐపీఎల్ చాన్స్
దేశంలోని మారుమూల ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు సాదాసీదా క్రికెటర్లకు ఐపీఎల్ ద్వారా సత్తాచాటుకొనే అవకాశం వస్తుంటే…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పుత్రుడు అర్జున టెండుల్కర్ మాత్రం తనవంతు అవకాశం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో గత రెండు సీజన్లుగా సభ్యుడిగా కొనసాగుతున్న చోటా సచిన్ అర్జున్ టెండుల్కర్ కు ఎడమచేతివాటం మీడియం పేసర్ గా, భారీషాట్లు ఆడే బ్యాటర్ గా పేరుంది. నెట్ బౌలర్ గా అనుభవం… ఇంగ్లండ్ లోని క్రికెట్ […]
దేశంలోని మారుమూల ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు సాదాసీదా క్రికెటర్లకు ఐపీఎల్ ద్వారా సత్తాచాటుకొనే అవకాశం వస్తుంటే…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పుత్రుడు అర్జున టెండుల్కర్ మాత్రం తనవంతు అవకాశం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టులో గత రెండు సీజన్లుగా సభ్యుడిగా కొనసాగుతున్న చోటా సచిన్ అర్జున్ టెండుల్కర్ కు ఎడమచేతివాటం మీడియం పేసర్ గా, భారీషాట్లు ఆడే బ్యాటర్ గా పేరుంది.
నెట్ బౌలర్ గా అనుభవం…
ఇంగ్లండ్ లోని క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందడంతో పాటు అర్జున్ టెండుల్కర్ కు టీమిండియా నెట్ బౌలర్ గా కూడా అనుభవం ఉంది. అంతర్జాతీయ సిరీస్ ల కోసం భారతజట్టు నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ద్వారా 22 సంవత్సరాల అర్జున్ చక్కటి అనుభవాన్ని సంపాదించాడు.
భారత క్రికెట్ కే తలమానికంగా భావించే ముంబై క్రికెట్ జట్టుతో పాటు..భారత జూనియర్ జట్టుకూ అర్జున్ మ్యాచ్ లు ఆడాడు. ముంబై టీ-20 జట్టులో ఒకటి రెండు మ్యాచ్ లు ఆడిన అనుభవం కూడా అర్జున్ కు ఉంది. అంతేకాదు..ముంబై టీ-20 లీగ్ లో కూడా అర్జున్ క్రమం తప్పకుండా పాల్గొంటూ వస్తున్నాడు.
20 లక్షల ధరతో …
2021 ఐపీఎల్ సీజన్లో ముంబై ఫ్రాంచైజీ 20 లక్షల రూపాయల కనీస ధరతో అర్జున్ ను తమజట్టులోకి తీసుకొంది. ఇటీవలే ముగిసిన 2022 సీజన్లో అర్జున్ ను ముంబై ఫ్రాంచైజీనే 30 లక్షల రూపాయల ధరతో రిటైయిన్ చేసుకొంది.
ప్రస్తుత సీజన్లో ముంబైజట్టు 14 రౌండ్లలో 10 పరాజయాలతో ఘోరంగా విఫలమైన సమయంలో జట్టులోని పలువురి యువఆటగాళ్లకు అవకాశం కల్పించారు. కనీసం ఆఖరిరౌండ్ మ్యాచ్ లోనైనా అర్జున్ కు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అర్జున్ ను పక్కన పెట్టి చివరకు హృతిక్ షౌకీన్, కుమార కార్తీకేయ లాంటి ఆటగాళ్లకు సైతం ముంబైజట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది.
దీంతో..అర్జున్ టెండుల్కర్ కు ఎందుకు అవకాశమివ్వలేదంటూ భారత క్రికెట్ వర్గాలలో చర్చకు తెరలేచింది.
ఇంకా రాటు దేలాల్సి ఉంది- బాండ్
ఐపీఎల్ ఫ్రాంచైజీలో చోటు సంపాదించడం తేలికే అయినా…తుదిజట్టులో చోటు సంపాదించడం మాత్రం అంతతేలిక కాదని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ బాగున్నా…బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో మెరుగుపడాల్సింది ఎంతో ఉందని బాండ్ అభిప్రాయపడ్డాడు. 22 మంది సభ్యులున్న జట్టునుంచి 11 మంది సభ్యుల తుదిజట్టును ఎంపిక చేయడం వెనుక ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయని, జట్టు సమతూకాన్ని సైతం పరిగణనలోకి తీసుకొంటామని బాండ్ వివరణ ఇచ్చాడు.
నాన్నప్రతిభలో సగం ఉన్నా…కపిల్
అర్జున్ టెండుల్కర్ కు అతని తండ్రి సచిన్ టెండుల్కర్ రికార్డులో శాపంగా మారాయని, సచిన్ ప్రతిభలో అర్జున్ కు సగం ఉన్నా అవకాశాలు వస్తాయని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ ఫీల్డ్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలంటే అర్జున్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, సచిన్ టెండుల్కర్ తనయుడు అన్నమాటే అర్జున్ పైన అనవసర ఒత్తిడి పెంచుతోందని కపిల్ చెప్పారు.
బయటవారి మాటలు , అంచనాలను ఖాతరు చేయకుండా తనకు నచ్చినట్లుగా అర్జున్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాలని కపిల్ సలహా ఇచ్చాడు. భారతజట్టు సభ్యుడిగా 22 సంవత్సరాలపాటు సచిన్ నెలకొల్పిన అసాధారణ రికార్డులు, అత్యున్నత ప్రమాణాలను చూసినవారు ..అర్జున్ నుంచి అసాధారణ ప్రతిభను ఆశించడంలో అర్థంలేదని కపిల్ విశ్లేషించారు.
ప్రతిభతోనే ఎదగాలి- సచిన్
మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం..క్రికెటర్ గా తన కుమారుడు అర్జున్ ఎదుగుదలలో జోక్యం చేసుకోబోనని, ప్రతిభతోనే పైకిరావాలని గతంలోనే ప్రకటించాడు.
సచిన్ ను అత్యుత్తమ క్రికెటర్ గా తీర్చిదిద్దటానికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు కల్పిండం వరకే తన బాధ్యతని..ప్రతిభతో అవకాశాలు సంపాదించుకొనే బాధ్యత
అర్జున్ దేనని పరోక్షంగా తెలిపాడు.
తన పేరు, పలుకుబడి తో అర్జున్ క్రికెటర్ గా ఎదగడాన్ని తమ కుటుంబసభ్యులు ఆమోదించే ప్రసక్తేలేదని సచిన్ తేల్చి చెప్పాడు. తగిన సాధనతో ఆటను ఆస్వాదిస్తూ తన కెరియర్ ను అర్జున్ కొనసాగించాలని 200 టెస్టులు, 30 వేల పరుగులు డజనుకు పైగా ప్రపంచ రికార్డుల ఘనత ఉన్న అభినవ బ్రాడ్మన్ సచిన్ భావిస్తున్నాడు.