లఖింపూర్ ఖేరీ రైతుల హత్యలకు ప్రత్యక్ష సాక్షిపై కాల్పులు
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ లో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వాహనం తోలి నలుగురి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు దిల్‌బాగ్ సింగ్ పై హత్యా ప్రయత్నం జరిగింది. లఖింపూర్ నుండి గోలాకు వెళుతుండగా మోటారుసైకిల్‌పై వచ్చిన దుండగులు అతనిపై దాడి చేశారు. అతని కారుపై పలు రౌండ్లు కాల్పులు జరిపారని, అయితే దిల్‌బాగ్ సింగ్ క్షేమంగా […]
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ లో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వాహనం తోలి నలుగురి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు దిల్‌బాగ్ సింగ్ పై హత్యా ప్రయత్నం జరిగింది.
లఖింపూర్ నుండి గోలాకు వెళుతుండగా మోటారుసైకిల్‌పై వచ్చిన దుండగులు అతనిపై దాడి చేశారు. అతని కారుపై పలు రౌండ్లు కాల్పులు జరిపారని, అయితే దిల్‌బాగ్ సింగ్ క్షేమంగా బయటపడ్డారు.
దిల్‌బాగ్ సింగ్ సమాచారం మేరకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అలీగంజ్ సమీపంలో అతను ఓ పని నిమిత్తం గోలాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. “నేను ఈ విషయమై గోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాను” అని సింగ్ చెప్పారు.
గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరీ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉండటం వల్లే సింగ్ పై ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. లఖింపూర్ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోను ప్రధాన నిందితుడు. గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాలోని టికోనా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై తన కారును నడపడంతో నలుగురు రైతులు మరియు ఒక జర్నలిస్టు మరణించారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ ప్రాంతంలో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు హింస చెలరేగింది. ఈ సంఘటన తర్వాత, ఆగ్రహం చెందిన రైతులు డ్రైవర్ మరియు ఇద్దరు బిజెపి కార్యకర్తలను కొట్టారు.