ఆత్మకూరు బరిలో బీజేపీ.. మరి జనసేన సంగతేంటి?
జూన్ 23న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఉప ఎన్నికల విషయంలో దివంగత నేతల కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే తాము పోటీకి దూరం అని గతంలోనే టీడీపీ ప్రకటించింది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ బద్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. ఆత్మకూరులో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ బీజేపీ ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం […]
జూన్ 23న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఉప ఎన్నికల విషయంలో దివంగత నేతల కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే తాము పోటీకి దూరం అని గతంలోనే టీడీపీ ప్రకటించింది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ బద్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. ఆత్మకూరులో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ బీజేపీ ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తోంది. మేకపాటి కుటుంబానికి బంధువైన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి, విక్రమ్ రెడ్డికి పోటీగా నిలబడాలనుకుంటున్నారు. ఆయనకు బీజేపీ కండువా కప్పి ఆ లాంఛనం కూడా పూర్తిచేశారు. అధికారిక ప్రకటనకు కొన్నిరోజులు సమయం పడుతుంది.
ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుందనే విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఖరారు చేశారు. అదే సమయంలో ఆయన బీజేపీ-జనసేన కూటమి కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ కూటమి తరపున అభ్యర్థిని బరిలో దింపే అవకాశం లేదు. జనసేన బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉంది, ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడా ఆ పార్టీ దూరంగానే ఉంటుందని అనుకోవాలి. కానీ బీజేపీ పరోక్ష ఒత్తిడి తెస్తోంది. ఉప ఎన్నికల్లో ఏకపక్షంగా బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించిన కమలదళం.. ఒకరకంగా జనసేనపై ఒత్తిడి పెంచినట్టే చెప్పుకోవాలి. కూటమిలో ఉండాలంటే కచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతివ్వాలి. మద్దతిస్తే.. అవకాశం మేరకు పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి రావాల్సి ఉంటుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చబోనంటూ ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరి ఆత్మకూరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందా, ఉంటే అది ఏ పార్టీకి పడాలి అనే విషయంపై పవన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు కాబట్టి.. కచ్చితంగా ఆత్మకూరులో జనసేన అభ్యర్థి బరిలో దిగే అవకాశం లేదు. తమ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలంటే మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కూడా జనసేన మద్దతు ఇవ్వకూడదు. పొత్తు కొనసాగుతుంది అనే సంకేతం పంపాలంటే మాత్రం కచ్చితంగా బీజేపీతో కలసి ప్రచారం చేయాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. బీజేపీ, జనసేన కూటమి కొనసాగుతుందా.. లేక బీటలు వారుతుందా అనేది ఆత్మకూరు ఉప ఎన్నికల ముందే తేలిపోయే అవకాశముంది. దీనిపై పవన్ కల్యాణ్ స్పందన మాత్రమే మిగిలుంది.
ALSO READ: తొలిరోజు సభకు వర్షం అడ్డంకి.. నేడు రాజమండ్రిలో సామాజిక న్యాయభేరి