అమలాపురం అల్లర్ల వెనక అన్ని పార్టీలు ?

కోనసీమ అల్లర్ల వెనక అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయా ? అన్ని పార్టీల కార్యకర్తలు ఈ అల్లర్లను రెచ్చగొట్టడంలో, ప్రత్యక్షంగా పాల్గొనడంలో ముందున్నారా ? పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళు ఇదంతా అవతలి పక్షం కుట్ర అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. ఆయా పార్టీల అధికార పత్రికలు కూడా ఆయా పార్టీల గొంతును వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ […]

Advertisement
Update:2022-05-27 11:30 IST

కోనసీమ అల్లర్ల వెనక అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయా ? అన్ని పార్టీల కార్యకర్తలు ఈ అల్లర్లను రెచ్చగొట్టడంలో, ప్రత్యక్షంగా పాల్గొనడంలో ముందున్నారా ? పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళు ఇదంతా అవతలి పక్షం కుట్ర అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. ఆయా పార్టీల అధికార పత్రికలు కూడా ఆయా పార్టీల గొంతును వినిపిస్తున్నాయి.

వైఎస్ జగన్ కు దళితులు దూరమయ్యారని అందువల్ల దూరమైన దళితులను మళ్ళీ దగ్గరికి తీసుకోవడానికి కోనసీమ అల్లర్ల కుట్ర వైసీపీ చేసిందని ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ”రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులతో పాటు ప్రత్యేక పథకాలను నిలిపేయడంతో ఈ సర్కార్‌ తమ హక్కులు, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని దళితులు భావిస్తున్నారు. దీంతో తమ దళిత ఓటు బ్యాంకుకు బీటలు పడుతున్నట్లు వైసీపీ అగ్రనేతలు కూడా గ్రహించారు. ఈ క్రమంలోనే.. ‘భావోద్వేగ’ అంశాలను తెరపైకి తెచ్చి, వారిని మళ్లీ తమ వైపునకు రప్పించుకునేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ‘అంబేడ్కర్‌’ పేరును వివాదాల్లోకి లాగినట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.” అని ఆంధ్రజ్యోతి తేల్చిపడేసింది.

ముందునుంచి కోనసీమ కు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాలని డిమాండ్ ఉన్నప్పటికీ కావాలనే ముందు కోనసీమ జిల్లా అని పేరు పెట్టి కొంత కాలం తర్వాత దాన్ని అంబేద్కర్ కోనసీమగా మార్చి మళ్ళీ తమ కార్యకర్తల ద్వారానే కోనసీన సాధన సమితిని ఏర్పాటు చేయించి ఆందోళనలకు ఉసిగొల్పారనే టీడీపీ వాదనను ఆంధ్రజ్యోతి వినిపిస్తోంది.

ఇక అమలాపురంలో జరిగిన విధ్వంసంలో మంత్రి విశ్వరూప్ అనుచరులు ఉన్నారంటూ ఈనాడు కొన్ని పేర్లను కూడా ప్రకటించింది. పోలీసు ఎఫ్ ఐ ఆర్ లో కూడా ఆ పేర్లు ఉన్నాయని కూడా ఆ పత్రిక పేర్కొంది. వైసీపీ కార్యకర్త అన్యం సాయి, ఈదరపల్లి వైసీపీ ఎమ్పీటీసీ సభ్యుడు అడ‌పా సత్తిబాబుతో పాటు 14 మంది వైసీపీ కార్యకర్తలున్నట్టు ఆ పత్రిక తెలిపింది.

ఇక ఈ అల్లర్ల వెనక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఉన్నారని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. అదే వాదనను సాక్షి పత్రిక వినిపిస్తోంది. గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారే అని ఆ పత్రిక పేర్కొంది. విధ్వంసానికి కుట్రపన్నింది స్థానిక జనసేన టీడీపీ నాయకులే అని సాక్షి తేల్చిపడేసింది. ఇక ప్రధాన నిందితుడు అన్యం సాయి జనసేన కార్యకర్త అని వైసీపీ చెప్తోంది.

అమలాపురంలో జరిగిన అల్లర్ల‌కు స‍ంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 70 మందిని గుర్తించారు. అందులో 46 మందిని అరెస్టు చేశారు. ఆయా పార్టీలు, వారి పత్రికలు ఏం చెప్పినప్పటికీ అందరూ కలిసి ఒప్పుకున్న నిజమేంటంటే అల్లర్లు అందరూ కలిసికట్టుగా చేసారని. ఇప్పుడు ఒకరిమీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్ని చేసుకున్నప్పటికీ ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు అంబేద్కర్ ను పాజిటీవ్ గానూ, నెగిటీవ్ గానూ వాడుకున్నారు. ఇప్పటికీ వాడుకుంటున్నారు.

పైగా అంబేద్కర్ పేరు కడపకు పెట్టొచ్చు కదా ! పులివెందులకు పెట్టొచ్చుకదా అంటూ పరోక్షంగా కోనసీమకు అంబేద్కర్ పేరుపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న‌ రాజకీయ నేతలు తమ‌కు అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవం, ప్రేమ బైటపెట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News