శేఖర్ మూవీ రివ్యూ
నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ రైటర్: లక్ష్మీ భూపాల రేటింగ్: 2/5 టాలీవుడ్ లో థియేట్రికల్ మార్కెట్ బాగా మారిపోయింది. కంటెంట్ లో దమ్ము ఉందంటేనే థియేటర్లకు వస్తున్నారు. స్టార్ ఎట్రాక్షన్ ఉంటేనే అటువైపు చూస్తున్నారు. […]
నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్ తదితరులు
నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్
సంగీతం: అనూప్ రూబెన్స్
రైటర్: లక్ష్మీ భూపాల
రేటింగ్: 2/5
టాలీవుడ్ లో థియేట్రికల్ మార్కెట్ బాగా మారిపోయింది. కంటెంట్ లో దమ్ము ఉందంటేనే థియేటర్లకు వస్తున్నారు. స్టార్ ఎట్రాక్షన్ ఉంటేనే అటువైపు చూస్తున్నారు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా థియేటర్లకు రావడం లేదు. ఈరోజు శేఖర్ మూవీ విషయంలో అదే జరిగింది. పెద్దగా బజ్ లేని ఈ సినిమాకు ఆక్యుపెన్సీ అస్సలు లేదు. భవిష్యత్తులో కూడా ఆక్యుపెన్సీ పెరగడం కష్టమే. ఎందుకంటే, ఈ సినిమా కంటెంట్ అలా ఉంది మరి.
మలయాళం ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకుల మధ్య అభిరుచుల్లో చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నోడు తెలుగు రీమేక్ తో కూడా హిట్ కొట్టగలడు. అక్కడ హిట్టయిన సినిమాను మహాప్రసాదంగా భావించేవాడు, తెలుగులో బోల్తాపడతాడు. ‘శేఖర్’ విషయంలో అదే జరిగింది. 2018లో వచ్చిన మలయాళీ జోసెఫ్ సినిమా అక్కడ పెద్ద హిట్టయింది. సినిమా మొత్తం సింగిల్ త్రెడ్ లో సాగుతుంది. నెరేషన్ ఫ్లాట్ గా ఉంటుంది. అది వాళ్లకు ఇష్టం. దాన్నే తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని అనుకోవడం భ్రమ అవుతుంది.
జోసెఫ్ లో మంచి కథ ఉంది, దానికి తగ్గట్టు మంచి ట్విస్టులు ఉన్నాయి. ఈ థ్రిల్లర్ మూవీని తెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో దాన్ని సీట్-ఎడ్జ్ థ్రిల్లర్ గా మార్చాల్సిన అవసరం చాలా ఉంది. కానీ దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఆ దిశగా ఎలాంటి కృషి చేసినట్టు కనిపించట్లేదు. మక్కికిమక్కి మలయాళం వెర్షన్ ను దించడానికే ఆమె ఇష్టపడ్డారు. ఆ దిశగానే కష్టపడ్డారు. చివరికి లొకేషన్లు, వస్త్రధారణలో కూడా ఆమె మలయాళం వాసన చూపించారు.
దీంతో శేఖర్ సినిమా నీరసంగా సాగుతుంది. మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ ఎంగేటింగ్ గా చెప్పలేకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపం. ప్రతి సన్నివేశం డైలీ సీరియల్ లా సాగుతుంటే సహనం నశించిపోతుంది. పైపెచ్చు రాజశేఖర్ కు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పెట్టడం సినిమా ఫ్లోను మరింత తగ్గించేశాయి. ఇంటర్వెల్ కార్డు, ప్రీ-క్లయిమాక్స్, క్లయిమాక్స్ ట్విస్టులు బాగున్నప్పటికీ మిగతాభాగం సాగతీత.
ఓల్డ్ మేన్ గా రాజశేఖర్ ను పరిచయం చేసిన విధానం బాగుంది. కేసుల్ని అతడు ఎలా పరిష్కరిస్తాడు, తన సొంత మనుషులు చనిపోయినప్పుడు ఆ కేసును ఎలా డీల్ చేశాడు లాంటివి బాగా చూపించారు డైరక్టర్ జీవిత. అయితే థ్రిల్లర్ లో ఉండాల్సిన వేగం లేకపోవడంతో సినిమా తేలిపోతుంది. అప్పటికప్పుడే భలే ఉంది అనిపిస్తుంది. ఆ వెంటనే నీరసం వచ్చేస్తుంది. ఇలా పడుతూలేస్తూ సాగుతుంది శేఖర్.
ఉన్నంతలో రాజశేఖర్ ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్న చేశాడు. రీమేక్స్ కు తను బెస్ట్ ఆప్షన్ అని నిరూపించుకున్నాడు. అతడి లుక్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం రాజశేఖర్ పడిన కష్టం మెప్పిస్తుంది. రాజశేఖర్ స్నేహితులుగా నటించిన అభినవ్ గోమటం, సమీర్ లాంటి వాళ్లు ఓకే అనిపించుకున్నారు. ప్రకాష్ రాజ్, శివానీ రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. సినిమాటోగ్రఫీ అంతంతమాత్రంగా ఉంది. ఎడిటింగ్ పేలవంగా ఉంది. అనూప్ రూబెన్స్ అక్కడక్కడ మాత్రమే మెరిశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. డైరక్టర్ జీవిత రాజశేఖర్ ఒరిజినల్ కథకు పెద్దగా మార్పులు చేయలేదు. 2018 నాటి మలయాళం సినిమా, 2022లో తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేస్తుందనే ధైర్యంతో సినిమా తీశారు. కానీ అది మంచి ఫలితాన్ని ఇవ్వదు.
ఓవరాల్ గా శేఖర్ సినిమాను రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే ఓసారి చూడొచ్చు. మంచి కథ, ట్విస్టులు ఉన్నప్పటికీ.. ఈ థ్రిల్లర్ నీరసంగా సాగుతుంది.