స్టాండప్ రాహుల్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీప్ర‌సాద్ తదిత‌రులు ర‌చ‌న‌- ద‌ర్శ‌కత్వం: సాంటో మోహన్ వీరంకి నిర్మాణ సంస్థ‌లు : డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ నిర్మాత‌లు : నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంగీతం : స్వీకర్ అగస్తి సినిమాటోగ్ర‌ఫి : శ్రీరాజ్ రవీంద్రన్ ఎడిట‌ర్ : ర‌వితేజ గిరిజెల్ల‌ రేటింగ్ : 2/5 రాజ్ తరుణ్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. అతడు ఎందుకు హిట్ కొట్టడం లేదు, అతడి సినిమాలు […]

Advertisement
Update:2022-03-18 16:14 IST

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీప్ర‌సాద్ తదిత‌రులు
ర‌చ‌న‌- ద‌ర్శ‌కత్వం: సాంటో మోహన్ వీరంకి
నిర్మాణ సంస్థ‌లు : డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్
నిర్మాత‌లు : నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
సంగీతం : స్వీకర్ అగస్తి
సినిమాటోగ్ర‌ఫి : శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిట‌ర్ : ర‌వితేజ గిరిజెల్ల‌
రేటింగ్ : 2/5

రాజ్ తరుణ్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. అతడు ఎందుకు హిట్ కొట్టడం లేదు, అతడి సినిమాలు ఎందుకు ఆడడం లేదు, అతడి జడ్జిమెంట్ ఎక్కడ మిస్ అవుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం స్టాండప్ రాహుల్. ఈరోజు రిలీజైన ఈ సినిమా చూస్తే రాజ్ తరుణ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో ఈజీగా అర్థమౌతుంది.

ఓ పాయింట్ నచ్చి సినిమాకు ఓకే చెబుతున్నాడు రాజ్ తరుణ్. అప్పుడెప్పుడో వచ్చిన అంధగాడు నుంచి ఇవాళ్టి స్టాండప్ రాహుల్ వరకు ప్రతి సినిమాకు అతడు కనెక్ట్ అయ్యేది ఇలా సింగిల్ లైన్ పాయింట్ కే. అదే అతడు చేస్తున్న తప్పు. స్టోరీలైన్ ఎంతలా ఆకట్టుకుంటుందో, అంతే ఆకట్టుకునే విధంగా కథనం కూడా ఉండాలనే విషయాన్ని రాజ్ తరుణ్ మిస్సవుతున్నాడు. ఈ విషయంలో అతడు ఇంతకుమించి జడ్జ్ చేయలేకపోతున్నాడా లేక అతడి ఇన్వాల్వ్ మెంట్ ఇంతవరకే పరిమితమా అనేది అతడే ఆలోచించుకోవాలి.

అసలు ప్రేమే వద్దనుకునే హీరో లివిన్ రిలేషన్ షిప్ తర్వాత హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడు. అదే హీరో కెరీర్ లో తన మనసుకు నచ్చిన ప్రొఫెషన్ ను ఎంచుకుంటాడు. ఈ రెండు పాయింట్లు కొత్తవేం కాదు. అలా అని బోర్ కొట్టించేవి కూడా కాదు. మంచి నెరేషన్ ఉంటే ఈ రొటీన్ పాయింట్స్ ను కూడా ఆకట్టుకునేలా తీయొచ్చు. ఆ నెరేషన్ విషయంలో స్టాండప్ రాహుల్ ఫెయిల్ అవుతుంది.

సింపుల్ గా చెప్పాల్సిన పాయింట్ ను కూడా అటుఇటు తిప్పి దర్శకుడు కన్ఫ్యూజ్ అయి, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అన్నింటికంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే.. ఈ సీరియస్ పాయింట్ ను అటు కామెడీగా చెప్పాలా ఇటు సీరియస్ గా మలచాలో అర్థం కాక దర్శకుడు అటుఇటు కాకుండా సినిమాను తీశాడు. అదే ఈ సినిమా కొంపముంచింది.

సీరియస్ గా చెప్పాల్సిన దగ్గర కామెడీ పెట్టారు. కామెడీ చూపెట్టాల్సిన దగ్గర పైపైన తేల్చేశారు. ఉదాహరణకు క్లైమాక్స్ ఎపిసోడ్ నే తీసుకుంటే.. ఆఖరి 10 నిమిషాలు ఎమోషనల్ గా చెబితే చాలా బాగుండేది. కానీ అక్కడ ఓ హిందీ సినిమా స్ఫూర్తితో క్లైమాక్స్ రాసుకొని కామెడీ పేరిట వెకిలి చేశారు. ఇక కామెడీగా చెప్పాల్సిన చోట పేలవమైన సన్నివేశాలు రాసుకొని, కామెడీ పండించలేకపోయారు. ఇలా స్టాండప్ రాహుల్ సినిమా.. అటు స్టాండ్ అవ్వలేక, ఇటు సిట్ అవ్వలేక మోకాలు మీద గోడ కుర్చీ వేసినట్టయింది.

కథ విషయానికొద్దాం.. రాహుల్ (రాజ్ తరుణ్)కు జీవితంలో ఏం చేయాలో అర్థం కాదు. స్డాండప్ కమెడియన్ అవ్వాలనుకుంటాడు. కానీ విడిపోయిన తల్లిదండ్రులు (ఇంద్రజ, మురళీశర్మ) మధ్య నలిగిపోతుంటాడు. మనసుకు నచ్చింది చేయమంటాడు తండ్రి. ఉద్యోగం చేసి జీవితంలో సెటిల్ అవ్వమంటుంది తల్లి. సరిగ్గా అప్పుడే రాహుల్ లైఫ్ లోకి వస్తుంది శ్రేయ (వర్ష బొల్లమ్మ). ఇద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకుంటారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఉద్యోగంలో కలుస్తారు. రాహుల్ ను శ్రేయ ఇష్టపడుతుంది. కానీ తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తల్లిదండ్రులు విడిపోవడం లాంటి కారణాల వల్ల రాహుల్ కు శ్రేయ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ప్రేమించడు. పెళ్లికి నో చెబుతుంటాడు. దీంతో రాహుల్ ను మార్చేందుకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ (సహజీవనం) చేద్దామంటుంది శ్రేయ. అలా ఇద్దరూ కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. తండ్రి చెప్పినట్టు స్టాండప్ కమెడియన్ గా ఉంటూనే, అమ్మకు ఇష్టమైన ఉద్యోగం కూడా చేస్తుంటాడు రాహుల్. ఫైనల్ గా రాహుల్ తనకు ఏం కావాలో రియలైజ్ అయ్యాడా? తను వదిలేసిన శ్రేయను దక్కించుకున్నాడా లేదా అనేది స్టోరీ.

కథ మొత్తం హీరో చుట్టూ తిరుగుతుంది. కానీ హీరోలో ఎనర్జీని చూపించని కథ ఇది. దీంతో ఎనర్జిటిక్ గా, ఆడుతూపాడుతూ కనిపించాల్సిన రాజ్ తరుణ్ సినిమా మొత్తం డల్ గా కనిపిస్తాడు. అతడి మేకోవర్ మాత్రం బాగుంది. హీరోయిన్ వర్ష బాగా చేసింది. హీరో తల్లిగా ఇంద్రజ, తండ్రిగా మురళీశర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ తో కామెడీ చేయించామని మేకర్స్ అనుకున్నారు. ప్రేక్షకుడు మాత్రం అలా అనుకోదు.

టెక్నికల్ గా కూడా సినిమా ఏమంత ఉన్నతంగా లేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ వీక్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరీ తీసికట్టుగా ఉంది. వీటన్నింటికంటే ముందు దర్శకుడు శాంటో గురించి చెప్పుకోవాలి. అతడు ఎంచుకున్న పాయింట్ లో కొత్తదనం లేకపోయినా, నెరేషన్ లోనైనా కొత్తదనం చూపించాల్సింది. స్టాండప్ కామెడీ, సహజీవనం కాన్సెప్టులు పెడితే కొత్తదనం వచ్చేస్తుందని అతడు ఫీల్ అయి ఉండొచ్చు. అంతకుమించి ఇందులో ఏం లేదు.

ఓవరాల్ గా స్టాండప్ రాహుల్ సినిమాలో 2-3 కామెడీ ఎపిసోడ్స్ మినహా చెప్పుకోడానికేం లేదు. ఓటీటీలో రావాల్సిన సినిమా ఇలా దారి తప్పి థియేటర్లలోకి వచ్చినట్టు అనిపిస్తుంది.

Tags:    
Advertisement

Similar News