ఆమ్ ఆద్మీకి దక్షిణాదిలో ఎంట్రీ ఉంటుందా..?

ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకే పరిమితం కాదనే విషయం తేలిపోయింది. ఢిల్లీతోపాటు ఇప్పుడు పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పాగా వేసింది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 40సీట్లున్న గోవాలో రెండు చోట్ల ఆప్ విజయం సాధించింది. మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి.. మెల్లగా అక్కడ కూడా పాగా వేస్తుందా.. అసలు ఆప్ కి దక్షిణాదిలో చోటుందా..? దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు బలంగా […]

Advertisement
Update:2022-03-12 04:10 IST
ఆమ్ ఆద్మీకి దక్షిణాదిలో ఎంట్రీ ఉంటుందా..?
  • whatsapp icon

ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకే పరిమితం కాదనే విషయం తేలిపోయింది. ఢిల్లీతోపాటు ఇప్పుడు పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పాగా వేసింది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 40సీట్లున్న గోవాలో రెండు చోట్ల ఆప్ విజయం సాధించింది. మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి.. మెల్లగా అక్కడ కూడా పాగా వేస్తుందా.. అసలు ఆప్ కి దక్షిణాదిలో చోటుందా..?

దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు బలంగా పాతుకుపోయాయి. ఈ దశలో కాంగ్రెస్, బీజేపీని కాదని ఆప్ కి చోటు ఉంటుందా అనేది అనుమానమే. అయితే కేజ్రీవాల్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. స్థానికంగా బలమైన నేతలకు ఆప్ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారాయన. పంజాబ్ లో భగవంత్ సింగ్ మన్ లాగా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కీలక నేతను ఆమ్ ఆద్మీకి ప్రతిరూపంగా చూపాలనుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో కమల్ హాసన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ భారీ విజయం తర్వాత నేరుగా కమల్ హాసన్ ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ ని కలిసొచ్చారు. తన స్నేహితుడు, ఆయన పార్టీకి అభినందనలు తెలిపేందుకే ఢిల్లీకి వచ్చానని చెప్పారు కమల్ హాసన్. కమల్ ఊపు చూస్తుంటే తమిళనాడులో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

తమిళనాడులో ఇద్దరు కీలక నేతల మహాభినిష్క్రమణం తర్వాత పొలిటికల్ గ్యాప్ ని క్యాష్ చేసుకోడానికి చాలామంది రంగంలోకి దిగారు. అందులో కమల్ కూడా ఒకరు. రజినీకాంత్ చివరి నిముషంలో సైలెంట్ అయిపోవడంతో కమల్ హాసన్ కి కాస్తో కూస్తో కలిసొస్తుందేమోనని అనుకున్నారు ఆయన అభిమానులు. కానీ మక్కల్ నీది మయ్యం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. ప్రస్తుతం తమిళనాట డీఎంకే హవా కొనసాగుతోంది. స్టాలిన్ ప్రభ వెలిగిపోతోంది. స్టాలిన్ కి ఎదురు నిలబడే స్టామినా అన్నాడీఎంకేలో ఎవరికీ లేదని తేలిపోయింది. ఆ పార్టీలో కూడా లుకలుకలు బయలుదేరాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఈ దశలో తమిళనాట ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తి స్థాయిలో తెరపైకి తెస్తె ఎలా ఉంటుందని కమల్ హాసన్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకుంటూ.. తమిళనాడులో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకోవడం లేదా, తన పార్టీని ఆప్ లో విలీనం చేసి చీపురు గుర్తుపైనే పోటీ చేయడం ఈ రెండూ కమల్ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు . కచ్చితంగా ఆయన వీటిలో ఒకటి ఎంచుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే.. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో.. ఆమ్ ఆద్మీకి మంచి ఎంట్రీ దక్కే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News