రాధేశ్యామ్ మూవీ రివ్యూ

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, సచిన్ ఖేడేఖర్, మురళి శర్మ, ప్రియదర్శి తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతం : తమన్ ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు నిర్మాణం : యూవీ క్రియేషన్స్, టి సిరీస్ నిర్మాతలు : వంశీ, ప్రమోద్, ప్రసీధ రచన – దర్శకత్వం : రాధాకృష్ణ నిడివి : 138 నిమిషాలు రేటింగ్ : 2.5/5 కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి. […]

Advertisement
Update:2022-03-11 14:24 IST

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, సచిన్ ఖేడేఖర్, మురళి శర్మ, ప్రియదర్శి తదితరులు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నేపథ్య సంగీతం : తమన్
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాణం : యూవీ క్రియేషన్స్, టి సిరీస్
నిర్మాతలు : వంశీ, ప్రమోద్, ప్రసీధ
రచన – దర్శకత్వం : రాధాకృష్ణ
నిడివి : 138 నిమిషాలు
రేటింగ్ : 2.5/5

కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి. ఎంత ఖర్చు పెట్టినా ఫర్వాలేదనిపిస్తాయి. కానీ విన్న కథను తెరపై చూసేటప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. రాధేశ్యామ్ విషయంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. జాతకానికి, ప్రేమకు ముడిపెడుతూ.. విధికి-ప్రేమకు మధ్య జరిగే యుద్ధంగా ఈ సినిమాను చూపించాలనుకున్నారు. చెప్పుకోడానికి బాగుంది కానీ, తెరపై చూడ్డానికి మాత్రం ఏమంత బాగా అనిపించలేదు ఈ సినిమా.

ఇందులో హీరో జాతకాలు చెప్పడంలో దిట్ట. తను చెప్పింది వంద శాతం జరుగుతుందని నమ్ముతాడు. కానీ హీరో గురువు మాత్రం జ్యోతిష్యం 99శాతం మాత్రమే కరెక్ట్ అంటాడు. సరిగ్గా అప్పుడే హీరోకు హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ ను వందేళ్లు బతుకుతావని చెబుతాడు హీరో. కానీ హీరోయిన్ అప్పటికే చావుకు దగ్గరగా ఉంటుంది. అటు హీరోకు కూడా తను ఎప్పుడు, ఎలా చనిపోతాడో తెలుసు. కానీ ఆ ఒక్క శాతం విధిని ఎదిరించినప్పుడు చరిత్ర సృష్టిస్తామనేది ఈ సినిమా కథ. ఇంకా చెప్పాలంటే చేతిరేఖల కంటే చేతలతో జాతకాన్ని మార్చుకోవచ్చని చెప్పే ప్రయత్నం ఇది.

జ్యోతిష్యం-విధి ఎలిమెంట్స్ తో సాగే ఈ కథకు ప్రేమను జోడించారు. అది చాలదనుకున్నారు. యూరోప్ బ్యాక్ డ్రాప్ అతికించారు. అది కూడా చాలదనుకున్నారు వింటేజ్ లుక్ తగిలించారు. అప్పటికీ తృప్తి చెందలేదు భారీ సెట్స్ వేశారు. ఇంకా ఏదో కావాలనుకున్నారు. క్లైమాక్స్ లో షిప్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇలా అదనంగా ఎన్నో హంగులు తగిలించారు. ఈ హడావుడిలో కీలకమైన కథను, నెరేషన్ ను పట్టించుకోలేదు. దీంతో కోట్లు పెట్టి తీసిన రాధేశ్యామ్ సినిమా మనసుకు హత్తుకోదు.

ప్రేమకథకు ఉండాల్సిన బేసిక్ లక్షణం హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ. తెరపై ఆ కెమిస్ట్రీ ఎంత బాగా పండితే సినిమా అంత పెద్ద హిట్టవుతుంది. దీనికి హిట్ సాంగ్స్ కూడా యాడ్ అయితే, ఇక ఆ సినిమాకు తిరుగుండదు. అప్పుడెప్పుడో వచ్చిన గీతాంజలి నుంచి తాజాగా వచ్చిన లవ్ స్టోరీ వరకు ఎన్నో ప్రేమకథలు ఈ విషయాన్ని నిరూపించాయి. రాధేశ్యామ్ లో ఈ రెండూ లోపించాయి. ప్రభాస్-పూజాహెగ్డే కెమిస్ట్రీ పండలేదు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు ఆకట్టుకోలేదు. ఈ రాతలే అనే సాంగ్ వినడానికి బాగుంది కానీ చూస్తుంటే ఎక్కలేదు.

ఇక రైటింగ్ విషయానికొస్తే, రాధేశ్యామ్ లో సరైన ప్రేమ సన్నివేశాలు పడలేదు. హీరోయిన్ ను హీరో ముగ్గులోకి దింపే సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. హాస్పిటల్ లో డెత్ ప్రాక్టీస్ అంటూ హీరో వేసే వేషాలు, హెయిర్ క్లిప్ ఎపిసోడ్ ను హీరో వివరించే సీన్.. ఇలా చెప్పుకుంటూ పోతే పేలవమైన నెరేషన్ కు ఎగ్జాంపుల్ గా చాలా సన్నివేశాలు చెప్పుకోవచ్చు. ఫేమస్ పామిస్ట్ గా ప్రభాస్ ను ప్రపంచమంతా గుర్తిస్తుంది. కానీ తన పక్కనే ఉన్న ఆ లెజెండ్ ను పూజాహెగ్డే గుర్తించదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా లాజిక్ లేని సన్నివేశాలు కోకొల్లలు.

జాతకం గురించి చెప్పడం మొదలుపెట్టి.. హీరోహీరోయిన్ల ఇంట్రడక్షన్ వరకు సినిమా బాగా నడుస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకోవు. ఇంటర్వెల్ లో పెట్టిన ట్విస్ట్ బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాతొచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. మళ్లీ నీరసం. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆకట్టుకుంటుందనుకున్న షిప్ ఎపిసోడ్, గ్రాఫిక్ సినిమాను తలపిస్తుంది తప్ప, ఎమోషన్ ను పండించదు. ఇక క్లైమాక్స్ లో వీల్ ఛెయిర్ లో హీరోయిన్ ను, ఒంటినిండా రక్తంతో హీరోను చూపించి ముగించడం కూడా అంతగా రుచించదు.

ఉన్నంతలో ఈ కథను బాగా లాక్కొచ్చిన వ్యక్తి ప్రభాస్. విక్రమాదిత్యగా అతడి యాక్టింగ్, లుక్ బాగుంది. ప్రేరణగా పూజాహెగ్డే మెరిసింది. వీళ్లిద్దరి తర్వాత చెప్పుకోడానికి చాలామంది ఆర్టిస్టులున్నాయి. భాగ్యశ్రీ, కృష్ణంరాజు, మురళీశర్మ, ప్రియదర్శి.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. కానీ ఎవ్వరికీ పట్టుమని 2 సీన్లు కూడా పడలేదు. టెక్నికల్ గా మాత్రం సినిమా అద్భుతంగా ఉంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ పెయింటింగ్ ను తలపించగా.. రవీందర్ ఆర్ట్ వర్క్ గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం చాలా చిన్నదౌతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉన్నంతలో ఓకే.

ఓవరాల్ గా లవ్ ఫీలింగ్స్ కోసం కాకుండా.. భారీ హంగులు, గ్రాఫిక్స్, ఆర్భాటాల కోసం రాధేశ్యామ్ సినిమాను ఓసారి చూడొచ్చు.

Tags:    
Advertisement

Similar News