2022 ఫిబ్రవరి నాటికి ఏపీలో అందరికీ 2 డోసుల టీకా..

ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని 2022 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 18ఏళ్లు పైబడినవారందరికీ రెండు డోసుల టీకా పూర్తవుతుందని తెలిపారు సీఎం జగన్. వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు వ్యాక్సినేషన్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తయ్యే వరకూ నిర్లక్ష్యం వహించొద్దని, కొవిడ్‌ నిబంధనలను […]

Advertisement
Update:2021-09-23 02:03 IST

ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని 2022 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 18ఏళ్లు పైబడినవారందరికీ రెండు డోసుల టీకా పూర్తవుతుందని తెలిపారు సీఎం జగన్. వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు వ్యాక్సినేషన్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తయ్యే వరకూ నిర్లక్ష్యం వహించొద్దని, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని చెప్పారు. అక్టోబరు 10 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 143 ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటవుతాయని అన్నారు జగన్.

డిసెంబర్ నుంచి సచివాలయాల సందర్శన..
సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కరోనా వల్ల ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టలేకపోయారాయన. ఇప్పుడు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతున్న సమయంలో జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. డిసెంబర్ నుంచి తాను సచివాలయాలను సందర్శిస్తానని తెలిపిన జగన్, ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. కలెక్టర్లు కూడా ప్రతివారం రెండు సచివాలయాలు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెప్పారు. తనిఖీల విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలకు వెనకాబడోమని హెచ్చరించారు.

– ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు సీఎం జగన్. భూమి వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.
– రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారో లేదో అనే అంశంపై దృష్టిపెట్టాలన్నారు.
– డిసెంబర్‌ 31 నాటికి 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, ఆలోగా సచివాలయాలకు అనుబంధంగా డిజిటల్‌ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
– దసరా సందర్భంగా అక్టోబరు 7 నుంచి 17 వరకూ ఆసరా పథకం రెండో విడత అమలు చేయాలని చెప్పారు.

పోలీస్ విభాగానికి ప్రశంసలు
ఇప్పటివరకు ఏపీలో 70,00,520 మంది దిశ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, ఇది ఓ పెద్ద ముందడుగని అన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వ హయాంలో ఛార్జిషీట్‌ వేయడానికి సగటున 300 రోజులు పడితే.. ఇప్పుడు 40 రోజుల్లో వేస్తున్నారని చెప్పారు. దేశంలో మహిళల మీద జరిగే నేరాల్లో 90 శాతం కేసుల్లో కేవలం రెండు నెలల వ్యవధిలో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందని, రాష్ట్ర పోలీసు విభాగం అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు సీఎం జగన్.

Tags:    
Advertisement

Similar News