జీహెచ్ఎంసీ వ్యవహారాలకు మేయర్ దూరం? రంగంలోకి కేకే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ విజయలక్ష్మి పాలనా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా? అధికారులతో పాటు సొంత పార్టీ నేతలే ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ అధికారం మాత్రం సొంతం చేసుకున్నది. ఈ క్రమంలో మేయర్ పదవికి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా సీనియర్ నాయకుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్ […]

Advertisement
Update:2021-08-25 09:18 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ విజయలక్ష్మి పాలనా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా? అధికారులతో పాటు సొంత పార్టీ నేతలే ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ అధికారం మాత్రం సొంతం చేసుకున్నది. ఈ క్రమంలో మేయర్ పదవికి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా సీనియర్ నాయకుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్ పదవి వరించింది. ఉన్నత విద్యావంతురాలైన విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా రాణిస్తుందని మొదటి నుంచి అందరూ భావించారు.

అయితే మేయర్ పదవి చేపట్టిన నాటి నుంచి విజయలక్ష్మి తీరు వివాదాస్పదమైంది. జీహెచ్ఎంసీ పాలనా వ్యవహారాల్లో ఆమె సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఆమె అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. ఆమె మాట్లాడిన తీరుతో విసిగిపోయి.. ఆ ఘటనను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారట. తాను సీనియర్ ఐపీఎస్ అయినా ఏ మాత్రం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మంత్రి వద్ద వాపోయారని సమాచారం. అంతే కాకుండా నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సన్నిహితులకు సంబంధించిన ఒక విషయంలో విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తున్నది. ఈ విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ వద్దకు చేర్చారు.

సీనియర్ పొలిటీషియన్, పార్టీ సెక్రటరీ జనరల్ అయిన కేకే కూతురు కావడంతో నేరుగా ఆమెతో మాట్లాడకుండా.. ఆమె వ్యవహారశైలిని తండ్రి దృష్టికి కేటీఆర్ తీసుకొని వెళ్లినట్లు తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న కేకే వెంటనే రంగంలోనికి దిగి జరిగిన డ్యామేజీని సరి చేసినట్లు సమాచారం, అంతే కాకుండా జీహెచ్ఎంసీ వ్యవహారాలకు కొంత కాలం తన కూతురుని దూరంగా ఉంచి స్వయంగా కేకేనే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీలో మేయర్ తీసుకునే నిర్ణయాలన్నింటినీ ముందుగా కేకే పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతే విజయలక్ష్మి సంతకాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

తన కూతురి వ్యవహారశైలి కారణంగా పార్టీలో, ప్రభుత్వంలో డ్యామేజీ ఏర్పడకూడదనే కేకే ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాగా, కేకే జీహెచ్ఎంసీ వ్యవహారాలు పర్యవేక్షించడంపై పార్టీ నాయకత్వం కూడా అభ్యంతరం చెప్పట్లేదని సమాచారం.

Tags:    
Advertisement

Similar News