వలస నాయకులకేనా అందలం.. టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరం..

ఈటల రాజేందర్ ను పార్టీనుంచి సాగనంపిన తర్వాత టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కొత్త పథకాలు సంచలనంగా మారాయి. ఈటలను టార్గెట్ చేస్తూ, హుజూరాబాద్ లో పార్టీ గెలుపుకోసం ఆయన వేస్తున్న ఎత్తుగడలు సొంతపార్టీ నేతల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా వలస నాయకులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడిన చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ […]

Advertisement
Update:2021-08-12 03:32 IST

ఈటల రాజేందర్ ను పార్టీనుంచి సాగనంపిన తర్వాత టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కొత్త పథకాలు సంచలనంగా మారాయి. ఈటలను టార్గెట్ చేస్తూ, హుజూరాబాద్ లో పార్టీ గెలుపుకోసం ఆయన వేస్తున్న ఎత్తుగడలు సొంతపార్టీ నేతల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా వలస నాయకులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడిన చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ పెట్టినప్పటినుంచి పార్టీలో ఉంటూ, పార్టీకోసం, రాష్ట్ర విభజన కోసం పనిచేసిన చాలామందికి ఇంకా పదవులు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం మరోసారి వలస నాయకులకు అనుకోని వరంగా మారింది. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, ఈటలను తిట్టి టీఆర్ఎస్ కండువా కప్పుకోగానే ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఖరారైంది. దీంతో చాలామంది సీనియర్లు నొచ్చుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమకు తగిన గుర్తింపు లేదని, పక్క పార్టీనుంచి వచ్చినవారికే పెద్దపీట వేస్తున్నారని బహిరంగ విమర్శలకు సైతం దిగారు నాయకులు. టీఆర్ఎస్ నేతల కడుపుమంట వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణకు కూడా కేసీఆర్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈటల చేరికతో బీజేపీకి గుడ్ బై చెప్పి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరిద్దరికీ సీట్లు ఖాయం అని తేలింది. ఇటీవలే పార్టీలో చేరిన మరో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకి కీలకమైన ‘దళితబంధు’ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించి, దానికి చైర్మన్‌ గా మోత్కుపల్లిని నామినేట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీడీపీలో ఉండగా మోత్కుపల్లి కేసీఆర్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో, ఏ స్థాయిలో విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి వారందర్నీ పార్టీలో చేర్చుకుని ఏరికోరి పదవులు ఇస్తుండే సరికి టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు పెరిగిపోతున్నాయి. పార్టీని నమ్ముకున్నవారికి పదవులు రావని, పక్క పార్టీనుంచి వస్తే మాత్రం ఎర్రతివాచీ పరుస్తారని అధిష్టానంపై మండిపడుతున్నారు.

Advertisement

Similar News