దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్‌

ఎమర్జెన్సీ ప్రకటించి కోరి చిక్కులు కొనితెచ్చుకున్న అధ్యక్షుడు

Advertisement
Update:2025-01-15 09:22 IST

ఎమర్జెన్సీ ప్రకటించి కోరి చిక్కులు కొనితెచ్చుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌. ఆయన ఇప్పటికే అభిశంసనకు గురైన విషయం విదితమే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 'మార్షల్‌ లా' విధించిన చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్‌ను అదుపులోకి తీసున్నట్లు అధికారులు వెల్లడించారు.

బుధవారం తెల్లవారు జామున వందలాదిమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. మొదట అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొద్దిసేపు ప్రతిష్టంబన నెలకొన్న అనంతరం అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ సుక్‌ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంరతం భారీ భద్రత మధ్య ఆయనను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్‌ను అరెస్టు చేయడానికి ఓసారి ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.

విపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు 'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో మార్షల్‌ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధమంటూ స్పీకర్‌ ప్రకటించారు. 

మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలో నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో దానిపై విచారించడానికి దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీచేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News