తప్పుకున్న యడియూరప్ప.. నెక్స్ట్ సీఎం ఎవరు..?
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజే ఆయన రాజీనామా చేయడం విశేషం. రాజీనామా లేఖను గవర్నర్ కి సమర్పించిన యడియూరప్ప, రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అయితే కాబోయే సీఎం విషయంలో తాను అధిష్టానానికి ఎవరి పేరు సిఫార్సు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామా విషయంలో ఎవరి ఒత్తిడి లేదని, అధిష్టానం కొత్త సీఎంగా ఎవరిని నియమించినా తాను […]
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజే ఆయన రాజీనామా చేయడం విశేషం. రాజీనామా లేఖను గవర్నర్ కి సమర్పించిన యడియూరప్ప, రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అయితే కాబోయే సీఎం విషయంలో తాను అధిష్టానానికి ఎవరి పేరు సిఫార్సు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామా విషయంలో ఎవరి ఒత్తిడి లేదని, అధిష్టానం కొత్త సీఎంగా ఎవరిని నియమించినా తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
కొత్త సీఎం ఎవరు..?
యడియూరప్ప రాజీనామా చేస్తారనే విషయం చాలా రోజుల ముందే తెలిసినా.. అధిష్టానం మాత్రం కర్నాటక కొత్త సీఎం విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. కర్నాటక కొత్త సీఎం ఎంపికకోసం పార్టీ పరిశీలకుడిగాధర్మేంద్ర ప్రధాన్ ని నియమించారు. ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, మురుగేష్ నిరాణి, బసవరాజ్ ఉన్నట్టు సమాచారం. మంగళవారం జరగబోయే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. నూతన సీఎం పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది.
రెండేళ్ల తర్వాత కర్నాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నేతకు పగ్గాలు అప్పగించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేసులో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజు. ఈయనకు సీఎం పదవి ఇవ్వాలని యడియూరప్ప సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఎవరి పేరు సూచించలేదని యడ్డీ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ కూడా సీఎం రేసులో ఉన్నారని సమాచారం. వీరంతా లింగాయత్ వర్గానికి చెందినవారే. యడియూరప్ప కూడా లింగాయత్ వర్గానికే చెందినవారు కావడంతో.. సీఎంను మార్చినా, ఆ వర్గాన్ని మార్చకూడదని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వేరే వర్గానికి ప్రాముఖ్యత ఇచ్చే అంశాన్ని కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
యడియూరప్ప ఎదురు తిరిగేనా..?
అధిష్టానం ఒత్తిడి లేదు అని పైకి చెబుతున్నా.. ఏడాదిపైగా యడియూరప్ప రాజీనామా అంశంపై అధిష్టానం దృష్టిపెట్టింది. దాన్ని అడ్డుకోడానికి యడియూరప్ప చివరి వరకూ ప్రయత్నించి ఓడిపోయారు. వివిధ ప్రాంతాల మఠాధిపతులు కూడా వచ్చి ఆయన్ని దీవించి, నాయకత్వ మార్పు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా యడియూరప్ప నాయకత్వంపై తమకు అసంతృప్తి లేదని చెప్పారు కూడా. అయితే ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే యడియూరప్ప రాజీనామా చేయడం విశేషం. రాజీనామా తర్వాత యడియూరప్ప ఎప్పుడైనే తోక జాడిస్తారా.. తన మద్దతు దారులతో గ్రూపు కట్టే సాహసం చేస్తారా అనేది ప్రస్తుతానికి అనుమానించాల్సిన విషయమే.