మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు సరే! డైరెక్టర్లు ఏరీ? ఇదేం అల‌స‌త్వం..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది తరువాతనైనా తన పాదయాత్ర హామీల్లో భాగంగా.. కులానికొక కార్పొరేషన్‌ను ఆయా వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి పదవుల సంతర్పణ చేశారు. ఒక్క సారిగా ఇంత పెద్ద సంఖ్యలో బలహీన, వెనుకబడిన వర్గాల వారికి పదవీయోగం కల్పించిన ఘనత ఆయనదే. అయితే వెనుకబడిన కులాల కార్పొరేషన్లపై చూపిన శ్రద్ధ మాత్రం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లపై చూపలేదనేది సత్యం. బీసీ కార్పొరేషన్ల […]

Advertisement
Update:2021-07-11 05:50 IST

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది తరువాతనైనా తన పాదయాత్ర హామీల్లో భాగంగా.. కులానికొక కార్పొరేషన్‌ను ఆయా వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి పదవుల సంతర్పణ చేశారు.

ఒక్క సారిగా ఇంత పెద్ద సంఖ్యలో బలహీన, వెనుకబడిన వర్గాల వారికి పదవీయోగం కల్పించిన ఘనత ఆయనదే. అయితే వెనుకబడిన కులాల కార్పొరేషన్లపై చూపిన శ్రద్ధ మాత్రం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లపై చూపలేదనేది సత్యం. బీసీ కార్పొరేషన్ల అధ్యక్షులందరికీ జెండా కారు, ప్రొటోకాల్‌ యోగం కల్పించారు. వారి కన్నా సుమారు ఏడాది ముందుగానే ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజించి మాల, మాదిగ, రెల్లి వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్లను నియమించి, వారికి కూడా జెండా కారు యోగం కల్పించినా.. వాటికి డైరెక్టర్‌ పదవులను నియమించడాన్ని గాలికొదిలేశారు.

ఈ ముగ్గురు ఛైర్మన్లు దర్జాగా కారుల్లో తిరుగుతూ ఉంటే జగన్‌ కోసం ఆరుగాలం కృషి చేసిన బలహీన (దళిత ) వర్గాల యువకులు మాత్రం ఉసూరుమంటూ తమకేమీ దక్కలేదన్న ఆవేదనతో ఉన్నారు.
జగన్‌ కోసం ఉరకలెత్తే ఉత్సాహంతో పని చేసిన ఈ యువకులు ప్రస్తుతం ఆయన్ను దర్శించే భాగ్యం లేక పార్టీ నేతల చుట్టూ డైరెక్టర్‌ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా కార్పొరేషన్లలో నియమితులైన డైరెక్టర్లు ప్రతి నెలా ఎంతో కొంత గౌరవవేతనాన్ని పొందుతున్నారు. ఆ లబ్ధి తమకు లేక పోయిందేనన్న బాధతో కూడా పార్టీలో దళిత యువకులు ఆవేదన చెందుతున్నారు. జగన్‌ పాలన రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటున్నా.. పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులను కూడా భర్తీ చేయడంలో సాగుతున్న జాప్యం ఆశావహులను నిరాశలో ముంచెత్తుతోంది. జగన్‌ కోసం కష్ట పడ్డాం. ఆయనకు పదవి వచ్చింది. మాకు మాత్రం..? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
Advertisement

Similar News