రామ్ దేవ్ యూ టర్న్.. బీజేపీ నష్టనివారణ చర్యలు..
బాబా రామ్ దేవ్ కి, బీజేపీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే భారతీయ వైద్య వ్యవస్థపై ఈ యోగా గురు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పటి వరకూ తగ్గేదే లేదన్న రామ్ దేవ్.. బీజేపీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి పరోక్షంగా సారీ చెప్పేశారు. ఆయుర్వేదం బెస్ట్ – అల్లోపతి వేస్ట్.. […]
బాబా రామ్ దేవ్ కి, బీజేపీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే భారతీయ వైద్య వ్యవస్థపై ఈ యోగా గురు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పటి వరకూ తగ్గేదే లేదన్న రామ్ దేవ్.. బీజేపీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి పరోక్షంగా సారీ చెప్పేశారు.
ఆయుర్వేదం బెస్ట్ – అల్లోపతి వేస్ట్.. అంటూ కొన్నిరోజుల క్రితం నోరుపారేసుకున్నారు రామ్ దేవ్. అంతే కాదు, వ్యాక్సిన్ సమర్థతని కూడా ప్రశ్నించారు. కరోనా చావులు ఎందుకు ఆగడంలేదని నిలదీశారు. అయితే రామ్ దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమంది. రామ్ దేవ్ పై పరువునష్టం దావా వేయడంతోపాటు.. ఐఎంఏ తరపున ఆందోళనలు కూడా విడతలవారీగా జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, ప్రధాని, ఐసీఎంఆర్ కి కూడా లేఖలు రాశారు ఐఎంఏ ప్రతినిధులు. ఢిల్లీ హైకోర్టులో రామ్ దేవ్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.
ఎవరు ఎన్ని చేసినా, తనని టచ్ చేయలేరంటూ ఆమధ్య డాంబికాలు పలికిన రామ్ దేవ్ ఎట్టకేలకు ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడితో దిగొచ్చారు. వైద్యులను దేవదూతలతో పోలుస్తూ మాట్లాడారు. తన పోరాటం వైద్యులపై కాదని, డ్రగ్ మాఫియాతో అని ప్రకటించారు. వ్యాక్సిన్ సమర్థతను ప్రశ్నించిన రామ్ దేవ్ తానే స్వయంగా టీకా తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచారు. భారతీయ వైద్య వ్యవస్థను తాను ద్వేషించడంలేదని, ఎమర్జెన్సీ, ఆపరేషన్ల సమయంలో అల్లోపతి అత్యుత్తమమైన వైద్య విధానం అని కొనియాడారు రామ్ దేవ్.
మొత్తమ్మీద రామ్ దేవ్ యూటర్న్ తీసుకున్నారనే విషయం స్పష్టమైంది. నేరుగా ఐఎంఏకి క్షమాపణలు చెప్పకపోయినా.. అల్లోపతిని ఆకాశానికెత్తేసి భారతీయ వైద్యుల ఆగ్రహావేశాలను కాస్త చల్లార్చారు. రామ్ దేవ్ వ్యాఖ్యల వల్ల బీజేపీ ప్రభుత్వం టార్గెట్ అవుతోందనే విషయం గ్రహించిన పెద్దలు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు రామ్ దేవ్ కరోనిల్ పై కూడా ఐఎంఏ వ్యతిరేక పోరాటానికి దిగడంతో పతంజలి బిజినెస్ పడిపోయే ప్రమాదం ఉందని ఆయనకు అర్థమైంది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కరోనా నివారణ హోమ్ కిట్ లో కరోనిల్ ని కలిపేశాయి. దీనికి వ్యతిరేకంగా ఐఎంఏ న్యాయపోరాటానికి దిగింది. దీంతో ఎట్టకేలకు రామ్ దేవ్ దిగొచ్చారు. ఆయుర్వేదం బెస్ట్.. అల్లోపతి కూడా బెస్ట్ అంటూ మాటమార్చారు..