ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా..

ఈనెల 5వతేదీ నుంచి ఏపీలో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు మంత్రి. ఏపీలో ఈపాటికే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. మే 5నుంచి ఫస్ట్ ఇయర్, ఆరో తేదీనుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. […]

Advertisement
Update:2021-05-02 13:20 IST

ఈనెల 5వతేదీ నుంచి ఏపీలో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు మంత్రి.

ఏపీలో ఈపాటికే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. మే 5నుంచి ఫస్ట్ ఇయర్, ఆరో తేదీనుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. 10.6లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హాల్ టికెట్లు కూడా డౌన్ లోడ్ చేసుకునేందుకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. కొవిడ్ అనుమానితులు ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాసేందుకు ఐసోలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మాస్కులు ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని ఇదివరకే మంత్రి ప్రకటించారు. అయితే ఆ తర్వాత వరుసగా వివిధ వర్గాలనుంచి ఒత్తిడిలు పెరిగాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పరీక్షల వాయిదా కోసం కోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలో పరీక్షల వాయిదాపై ఆలోచించాలని కోర్టు ప్రభుత్వానికి సూచిస్తూ ఈనెల 3న అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని చెప్పింది.

పరీక్షల వాయిదాపై ప్రకటన విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్.. వాయిదా వేయడానికి గల కారణాలను వివరించారు. కోవిడ్‌ సమయంలో కూడా వెనకంజ వేయకుండా అన్ని పథకాలు అమలు చేస్తూ, ఈ తరం పిల్లలు పోటీ ప్రపంచంలో తలెత్తుకుని నిలబడేందుకు, నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి ఇంటిలోనూ ఆయా కుటుంబాల స్థితిగతులు గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎలాంటి బాధ్యత, మమకారం ఉంటుందో, మొత్తంగా రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ప్రభుత్వానికీ అంతే బాధ్యత, మమకారం ఉందని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షల వాయిదాపై మాత్రమే ప్రకటన విడుదల చేసిన మంత్రి, పదో తరగతి పరీక్షల గురించి మాత్రం ఎలాంటి సంకేతాలివ్వలేదు. వాస్తవానికి జూన్ 7నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా కేవలం వాయిదా వేస్తున్నట్టు మాత్రమే ప్రకటించారు కాబట్టి, పదో తరగతి పరీక్షలపై కూడా సమయం వచ్చినపుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 7లోగా పరిస్థితులు చక్కబడితే పది పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News