టీఆర్ఎస్ పుట్టినరోజున చస్తే గుర్తిస్తారా..? " షర్మిల స్ట్రాంగ్ కౌంటర్..
తెలంగాణలో నిరుద్యోగుల తరపున నోటిఫికేషన్లకోసం పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓవైపు టీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్న దశలో, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. నల్గొండలో శ్రీకాంత్ అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై షర్మిల స్పందించారు. శ్రీకాంత్ ఫొటోని పోస్ట్ చేస్తూ, ఆమె భావోద్వేగంతో ట్వీట్ చేశారు. “నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల […]
తెలంగాణలో నిరుద్యోగుల తరపున నోటిఫికేషన్లకోసం పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓవైపు టీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్న దశలో, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. నల్గొండలో శ్రీకాంత్ అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై షర్మిల స్పందించారు. శ్రీకాంత్ ఫొటోని పోస్ట్ చేస్తూ, ఆమె భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
“నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను.. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం.” అని పోస్టింగ్ పెట్టారు షర్మిల.
“అయ్యా KCR సారు, కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమో నని, నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి.” అంటూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు షర్మిల.
ఇటీవల కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ బలవన్మరణం మరవకముందే నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్ (25) అనే యువకుడు ఉద్యోగం రాలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోటనీలో శ్రీకాంత్ ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గతంలో అనారోగ్యం కారణంతో శ్రీకాంత్ తండ్రి రామచంద్ర మృతిచెందగా, మానసిక రోగి అయిన తల్లిని కనిపెట్టుకుని ఉంటూ.. పట్టుదలతో పీజీ పూర్తి చేశాడు శ్రీకాంత్. అయితే నోటిఫికేషన్ల ఊసే లేకపోవడం, ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లుగా శ్రీకాంత్ కూడా మనోవేదనకు గురయ్యేవాడని తెలిసింది. కరోనా కష్టకాలంలో ఇక నోటిఫికేషన్లు కష్టమని తేలడంతో శ్రీకాంత్ పొలంలో పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు షర్మిల. నోటిఫికేషన్లకోసం నిరాహార దీక్షలు మొదలు పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. ఈ దశలో మరో నిరుద్యోగి శ్రీకాంత్ అకాల మరణంపై షర్మిల తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిప్డడారు.