మోగిన పరిషత్ నగారా.. టీడీపీ అస్త్ర సన్యాసం..?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజే.. నీలం సాహ్ని కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 8న పోలింగ్, 10న ఓట్ల లెక్కింపు, అదేరోజు ఫలితాల వెల్లడి ఉంటాయి. తిరుపతి ఉప ఎన్నికకు ముందే పరిషత్ ఎన్నికల ఘట్టం పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదలైంది. అవసరమైన చోట 9వ తేదీ రీపోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజే.. నీలం సాహ్ని కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 8న పోలింగ్, 10న ఓట్ల లెక్కింపు, అదేరోజు ఫలితాల వెల్లడి ఉంటాయి. తిరుపతి ఉప ఎన్నికకు ముందే పరిషత్ ఎన్నికల ఘట్టం పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదలైంది. అవసరమైన చోట 9వ తేదీ రీపోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33,663 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ ఆదేశాలిచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా గతేడాది.. వీటిలో 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లు స్వీకరించారు. 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 526 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగాను, 2,371 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 7,322 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసులతో 354 ఎంపీటీసీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా పరిషత్ ఎన్నికలు వాయిదా పడగా.. ఇప్పుడు ఆ ప్రక్రియ ఆగినచోటనుంచే కొత్త షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఏకగ్రీవాలపై గుర్రుగా ఉన్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తన హయాంలో పంచాయతీ, మున్సిపాల్టీ ఎన్నికలను పూర్తి చేసినా, పరిషత్ లాంఛనాన్ని మాత్రం ముగించలేదు. ఆయన స్థానంలో నూతన ఎస్ఈసీగా ఎంపికైన నీలం సాహ్ని, బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి మిగిలిన ప్రక్రియను ముగించేస్తున్నారు.
టీడీపీ అస్త్ర సన్యాసం..?
పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే.. టీడీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే వైసీపీ నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు. ఆడలేక మద్దెల ఓడన్నట్టు.. ఓడిపోతామని భయపడే చంద్రబాబు పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని అన్నారు మంత్రి పేర్ని నాని. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోతే.. దాని ప్రభావం తిరుపతి ఉప ఎన్నికపై ఉంటుందనే భయం చంద్రబాబులో ఉందని చెప్పారు. అయితే టీడీపీ తరఫున అలాంటి అధికారిక ప్రకటనేదీ విడుదల కాలేదు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలు బహిష్కరించే నిర్ణయం ఇంకా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.