అటవీ 'సింగమ్' ఆత్మహత్య.. మహారాష్ట్రలో ఖాకీ కలకలం..
ముకేష్ అంబానీ ఇంటిముందు పేలుడు వస్తువుల కారు విషయంలో ముంబై పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ.. తాజాగా అటవీ అధికారుల తీరు మరింత వివాదాస్పదమైంది. మహారాష్ట్ర లేడీ సింగమ్ గా గుర్తింపు తెచ్చుకున్న అటవీ అధికారి దీపాలీ చవాన్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ ఆమెను లైంగికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని సూసైడ్ నోట్ లో ఉంది. అంతే కాదు.. గర్భిణిగా […]
ముకేష్ అంబానీ ఇంటిముందు పేలుడు వస్తువుల కారు విషయంలో ముంబై పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ.. తాజాగా అటవీ అధికారుల తీరు మరింత వివాదాస్పదమైంది. మహారాష్ట్ర లేడీ సింగమ్ గా గుర్తింపు తెచ్చుకున్న అటవీ అధికారి దీపాలీ చవాన్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ ఆమెను లైంగికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని సూసైడ్ నోట్ లో ఉంది. అంతే కాదు.. గర్భిణిగా ఉన్న సమయంలో కావాలనే కొండలపైకి నడిపించారని, అందుకే గర్భస్రావం అయిందని కూడా ఆ లేఖలో పేర్కొంది దీపాలీ. సభ్య సమాజంలో ఇంతకంటే అనాగరికత, అమానుషం ఇంకోటి ఉంటుందా అంటే అనుమానమే.
మహారాష్ట్ర అమరావతి జిల్లా టైగర్ రిజర్వ్ లో దీపాలీ విధులు నిర్వహిస్తుండేవారు. హరిసాల్ గ్రామంలో అధికారిక నివాసంలో ఆమె ఉండేవారు. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్ ధారలో ట్రెజరీ అధికారి. ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్ ‘లేడీ సింగమ్’గా పేరు సంపాదించుకున్నారు. ఆమె వయసు కేవలం 28ఏళ్లు మాత్రమే.
ఖాకీ యూనిఫామ్ వేసుకుని పైకి కరకుగా కనిపించినా.. దీపాలీ మనసు మాత్రం చాలా సున్నితం అనే విషయం ఆమె ఆత్మహత్యతో అర్థమవుతోంది. అటవీ మాఫియాని హడలెత్తించిన లేడీ సింగమ్.. సొంత డిపార్ట్ మెంట్ లోని చీడపురుగులకు మాత్రం భయపడ్డారు. ఉన్నతాధికారులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు తన ప్రాణం తాను తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా శివకుమార్ వేధింపులు భరించలేక మానసికంగా కుంగిపోయిన దీపాలీ.. ఇటీవల గర్భస్రావం కావడంతో మరింతగా తల్లడిల్లిపోయారు. చివరకు తన సర్వీస్ రివాలర్వ్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
శివకుమార్ నీఛుడు, దుర్మార్గుడు..
సూసైడ్ చేసుకునేముందు దీపాలీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తనతో గడపాలని శివకుమార్ ఒత్తిడి చేసేవాడని, తాను అంగీకరించకపోవడంతో అదనపు డ్యూటీలు వేస్తూ వేధిండేవాడని ఆ లేఖలో రాశారు దీపాలీ. తాను గర్భిణిగా ఉన్న సమయంలో డ్యూటీ పేరుతో కొండల్లోకి లాక్కెళ్లాడని, అందుకే తనకు గర్భస్రావం అయిందని ఆరోపించారు. శివకుమార్ దుర్మార్గాలపై ఇప్పటికే చాలాసార్లు ఆయన సీనియర్, ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు తర్వాత తనకు మానసిక హింస మరింత ఎక్కువైందని, వేధింపులు పెరిగాయని లేఖలో వివరించారు. దీపాలీ ఆత్మహత్య తర్వాత, పారిపోతున్న వినోద్ శివకుమార్ ను పోలీసులు నాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు శివకుమార్ ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.