ఏకగ్రీవాలు రద్దు చేసే అధికారం మీకెక్కడిది..?
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలు వెల్లడి చేయకూడదంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్. చంద్రబాబు జిల్లా చిత్తూరు, నిమ్మగడ్డ సొంత జిల్లా గుంటూరులో.. ఏకగ్రీవాలు వద్దంటూ వారిద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. జిల్లాల్లో ఎన్ని ఏకగ్రీవాలు జరగాలో, ఎన్ని జరగకూడదో నిర్ణయించడానికి బాబు, నిమ్మగడ్డ ఎవరని ప్రశ్నించారు. గ్రామ ప్రజలంతా కలసి ఏకగ్రీవంగా సమర్థుడైన […]
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలు వెల్లడి చేయకూడదంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్. చంద్రబాబు జిల్లా చిత్తూరు, నిమ్మగడ్డ సొంత జిల్లా గుంటూరులో.. ఏకగ్రీవాలు వద్దంటూ వారిద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. జిల్లాల్లో ఎన్ని ఏకగ్రీవాలు జరగాలో, ఎన్ని జరగకూడదో నిర్ణయించడానికి బాబు, నిమ్మగడ్డ ఎవరని ప్రశ్నించారు. గ్రామ ప్రజలంతా కలసి ఏకగ్రీవంగా సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకుంటే.. వద్దని చెప్పడానికి, చంద్రబాబుకి, నిమ్మగడ్డకు ఉన్న అధికారం ఏంటని అడిగారు. ఏకగ్రీవం అయిన చోట్ల.. ఏ ఒక్క వ్యక్తి అయినా తమను నామినేషన్ వెయ్యకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారా అని అడిగారు. అసలు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఏకగ్రీవాలను ఏకపక్షంగా అడ్డుకోవడం దుర్మార్గం అని చెప్పారు జోగి రమేష్. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకూ, ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వకపోతే, నామినేషన్ వేసిన వారంతా సర్పంచ్ లుగా ఎన్నికైనట్టేనని చెప్పారు. వారిని ఆపే అధికారం నిమ్మగడ్డకు గానీ, చంద్రబాబుకుగానీ లేదని అన్నారు.
కోర్టులో తేల్చుకుందాం రండి..
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దనుకుంటే, అది అప్రజాస్వామికం అనుకుంటే.. నిమ్మగడ్డ, చంద్రబాబు కలసి కోర్టులో రిట్ పిటీషన్ వేయాలని సలహా ఇచ్చారు జోగి రమేష్. అసెంబ్లీ, లోక్ సభ స్పీకర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఉప రాష్ట్రపతి, చివరికి రాష్ట్రపతి వరకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగుతుంటాయని, ఈ ఆనవాయితీని వద్దంటూ నిమ్మగడ్డ చట్టం తెస్తారా అని ప్రశ్నించారు జోగి రమేష్.
ఒకవైపు రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూ, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ శిఖండుల్లా రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేయడానికి పూనుకున్నారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. నిమ్మగడ్డలాంటి శిఖండిని అడ్డుపెట్టుకుని ఎన్నికలు నడిపిస్తున్న చంద్రబాబు వైసీపీకి ఎప్పటికీ పోటీ కాలేరని అన్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటూ.. దుగ్గిరాలలో ఓటు అడిగే రూల్స్ తెలియని ఓ అసమర్థుడిని చంద్రబాబు ఎన్నికల కమిషనర్ గా ప్రజలపై రుద్దాడని విమర్శించారు.
చర్యలు తీసుకోమంటే.. రద్దుచేస్తామంటారా..?
పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకోసం టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు జోగి రమేష్. దీనిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి మేనిఫెస్టో రద్దు చేస్తున్నామని చెప్పడం దేనికి సంకేతం అని అన్నారు. నిమ్మగడ్డకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీపై చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా అప్పటికే విడుదలైన మేనిఫెస్టోని రద్దు చేశామంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. బాబు తొత్తుగా, ఆయన తాబేదారుగా నిమ్మగడ్డ ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముందని అన్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ ప్రవర్తన మారాలని, బాబు స్క్రిప్టు పట్టుకుని చదివే విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు.
నిమ్మగడ్డ, చంద్రబాబు కలసి ఎన్ని కుట్రలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం మంది వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు జోగి రమేష్. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారు కూడా… ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో పెద్దఎత్తున టీడీపీ నుంచి వైసీపీకి ఓట్లు బదిలీ అవుతుంటే.. చంద్రబాబు, నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.