మనోడే.. వేసెయ్ ఒక పూలదండ
ఆమధ్య ఏపీ హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందిన రాకేష్ కుమార్ సొంతూరికి వెళ్లిపోతుంటే తుళ్లూరు గ్రామస్తులంతా దారి పొడవునా రోడ్డుపక్క నిలబడి ప్లకార్డులు పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు. ఆయన కారుని ఆపి మరీ పూలదండలు వేసి సందడి చేశారు. ఓ బ్యాచ్ మోకాళ్లమీద నిలబడి మరీ తమ వినమ్రత తెలియజేసింది. ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీపై వెళ్తున్నా కూడా అదే తంతు. జడ్జిలకు సామాన్య ప్రజల్లో ఇంతమంది అభిమానులుంటారా అంటూ […]
ఆమధ్య ఏపీ హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందిన రాకేష్ కుమార్ సొంతూరికి వెళ్లిపోతుంటే తుళ్లూరు గ్రామస్తులంతా దారి పొడవునా రోడ్డుపక్క నిలబడి ప్లకార్డులు పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు. ఆయన కారుని ఆపి మరీ పూలదండలు వేసి సందడి చేశారు. ఓ బ్యాచ్ మోకాళ్లమీద నిలబడి మరీ తమ వినమ్రత తెలియజేసింది. ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీపై వెళ్తున్నా కూడా అదే తంతు. జడ్జిలకు సామాన్య ప్రజల్లో ఇంతమంది అభిమానులుంటారా అంటూ ఆశ్చర్యపోవడం మిగతా ఏపీ వంతయింది. న్యాయవ్యవస్థకు ప్రజలిచ్చే గౌరవం అది అనుకుందాం… కానీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి టీడీపీ కార్యకర్తలు చేసిన సన్మానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అసలు టీడీపీ కార్యకర్తలకు ఎస్ఈసీతో ఏం పని? వీరందరికీ ఆయన ఆరాధ్యుడిగా ఎప్పుడు మారిపోయారు. పోనీ శాలువాలు, దండలు వేయడానికి వారు ముందుకొస్తున్నారు సరే.. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ అయినా వారించాలి కదా. గతంలో బీజేపీ నేతల్ని హోటల్ లో రహస్యంగా కలిసినప్పుడే ఆయన వ్యవహారం తేలిపోయింది. అప్పుడు రహస్యంగా ఉన్నది కాస్తా ఆ తర్వాత బహిరంగ రహస్యం అయింది. అందుకే ఇలా బహిరంగంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.
న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థకు.. ప్రభుత్వంతో సంబంధం ఉండాలే కానీ, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు మంచివి కావు. అలాంటి సంబంధాలు కొనసాగిస్తే.. ప్రజల్లో వారి పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. సాక్షాత్తూ ప్రభుత్వంపైనై విమర్శలు ఎక్కుపెట్టిన జడ్జి.. తన పదవీ కాలంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారనే ప్రజలు భావిస్తారు. అందుకే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న రాజధాని ప్రాంత ప్రజలు రిటైరై వెళ్లిపోతున్న జడ్జి రాకేశ్ కుమార్ ని సన్మానించి సాగనంపారు. తమకు ఎన్నో మేళ్లు చేసిన ఆయన రుణం ఎలా తీర్చుకోవాలా అంటూ మధన పడ్డారు. ఇప్పుడు నిమ్మగడ్డ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టీడీపీ వర్గాల్లో ఆయన హీరో, టీడీపీ అనుకూల మీడియా ఆయన్ను ఆకాశానికెత్తేస్తుంది. స్థానిక ఎన్నికల వ్యవహారంతో కోర్టు కేసులు, అధికారులతో చర్చలు.. అంటూ హంగామా చేస్తున్న నిమ్మగడ్డ.. ప్రభుత్వంతో మాత్రం అస్సలు చర్చలు జరపరు. అప్పుడు ఎన్నికలు వాయిదా వేసినా, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అన్నీ ఏకపక్షమే. వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు ప్రజా పక్షంగా ఉండాలి కానీ, ఏకసపక్ష నిర్ణయాలతో విమర్శలపాలు కాకూడదు. ఇలాంటి బహిరంగ సన్మానాలతో మరింత పలుచన కాకూడదు.