కమల్ హాసన్, కంగనా రనౌత్ నడుమ శశిథరూర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాజకీయంగా కూడా పెను దుమారానికి కారణమయ్యాయి. తాజాగా తమిళ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ నేత శశిథరూర్లతో తగువుకు దిగింది కంగనా. ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామన్న […]

Advertisement
Update:2021-01-06 16:06 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాజకీయంగా కూడా పెను దుమారానికి కారణమయ్యాయి. తాజాగా తమిళ నటుడు కమల్ హాసన్, కాంగ్రెస్ నేత శశిథరూర్లతో తగువుకు దిగింది కంగనా. ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామన్న కమల్ హామీపై ఆమె ఘాటుగా స్పందించింది.

కంగనా రనౌత్ వెండితెరమీదే కాదు, నిజ జీవితంలోనూ నిఖార్సైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉండే కంగనా అధికార పార్టీ విధానాలను వంతపాడడంతో పాటు ప్రతిపక్షాల వాదనను వేలెత్తిచూపడంలో ఎప్పుడూ ముందుంటుంది. అది ఏ విషయమైనా సరే, కంగనా తన స్టైల్ లో స్పందిస్తుంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు వివాదస్పద చట్టాల విషయంలో కంగనా కాంట్రవర్సీలను క్రియేట్ చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సినీ నటులు, సామాజిక కార్యకర్తలపై నోటి దురుసును ప్రదర్శించింది.

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనను విచ్ఛిన్నకర శక్తుల కుట్రగా వర్ణించింది కంగనా. ఆందోళనకారులను రోజుకూలీ తీసుకునే కిరాయి మనుషులంటూ ఆరోపించింది. ఈ విషయంలో అటు రైతులు, ఇటు పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఎన్నికల హామీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి మరోమారు వార్తల్లో నిలిచింది కంగనా.

తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిచేసే గృహిణులకు సైతం వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు కమల్ హాసన్. ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. కమల్ ప్రకటనపై పలువురు ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం కమల్ ఆలోచనను మెచ్చుకున్నారు. గృహిణిలకు వేతనాలు చెల్లించడం మంచి ఆలోచన అంటూ కొనియాడారు. కాగా… శశి థరూర్ వ్యాఖ్యలపై కంగనా విమర్శలు గుప్పించింది.

ఇళ్లు అనే రాజ్యానికి మహిళే రాణి అని, అలాంటప్పుడు వేతనం ఎందుకని ప్రశ్నించింది కంగనా. ప్రతీదానిని వ్యాపారంగా చూడొద్దంటూ, ఇంటి యజమానిని ఉద్యోగిగా మార్చొద్దంటూ ట్వీట్ చేసింది. మహిళల పనికి విలువ కట్టొద్దన్న కంగనా అక్కడి ఆగకుండా… ప్రేమించే వ్యక్తులతో చేసే శృంగారానికి, మాతృత్వానికి కూడా విలువ కట్టొద్దంటూ వ్యాఖ్యానించారు. కంగనా కామెంట్స్ పై శశిథరూర్ సైతం స్పందించారు. ప్రతి మహిళకూ కనీస ఆర్థిక భరోసా అవసరమని, భారతీయ మహిళలందరూ కంగనాలాగే సాధికారత సాధించాలని అన్నారు. మొత్తానికి కంగనా నడక ఆమెను రాజకీయాలకు చేరువ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News