ప్రగతిభవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్..!
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. తాము గెలిచి నెలరోజులవుతున్నా.. ఇంతవరకు ప్రమాణం చేయించకుండా కాలయాపన చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్ఎంసీ పాలకమండలిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బేగంపేటలోని హరితప్లాజాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రరెడ్డితో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు […]
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. తాము గెలిచి నెలరోజులవుతున్నా.. ఇంతవరకు ప్రమాణం చేయించకుండా కాలయాపన చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్ఎంసీ పాలకమండలిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బేగంపేటలోని హరితప్లాజాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రరెడ్డితో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.
అనంతరం బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు వెళ్లారు. దీంతో వెంటనే అలర్టయిన పోలీసులు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఏమన్నా రౌడీ షీటర్లమా.. అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తాము గెలిచి నెలరోజులవుతున్నా తమకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగకుండా రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని వాళ్లు ఆరోపించారు.
మరోవైపు టీఆర్ఎస్ నేతలు కొందరు ప్రలోభాలకు తెరలేపారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ కార్పొరేటర్ కూడా అమ్ముడుపోరని వాళ్లు చెప్పారు. వెంటనే జీహెచ్ఎంసీ పాలకమండలిని ఏర్పాటుచేయాలని.. మేయర్ ఎన్నిక నిర్వహించాలని కొంతకాలంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ మేయర్ పదవిని చేపట్టాలంటే ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిందే. అయితే గత ఎన్నికల ముందు టీఆర్ఎస్, ఎంఎంఐం ఒక్కటేనని టీఆర్ఎస్కు ఓటేసినా.. ఎంఐఎంకు ఓటు వేసినట్టేనని బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ టీఆర్ఎస్ నేతలు బీజేపీ ఆరోపణలను ఖండించారు. ఈ క్రమంలో ప్రస్తుతం మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.